చైనా బైక్ ల పేరుతో టోకరా
చైనా బైక్ ల పేరుతో టోకరా
Published Sat, Sep 10 2016 4:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: చైనా బైక్స్ విక్రయానికి సంబంధించిన షోరూమ్స్ అనుమతుల పేరుతో దేశ వ్యాప్తంగా అనేక మందికి టోకరా వేసిన నగరవాసి శివకుమార్‌ను సీసీఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై నగరంలో 6 కేసులు నమోదై ఉన్నాయి. హైదర్ మోటార్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన శివ చైనా నుంచి ద్విచక్ర వాహనాలను తీసుకువచ్చి విక్రయిస్తామంటూ ప్రచారం చేశాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు.
దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మందిని డీలర్‌షిప్‌లు ఇస్తున్నట్లు చెప్తూ వారి నుంచి డిపాజిట్లు వసూలు చేశాడు. కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు దండుకున్నాడు. ఇతడి బారినపడిన వారిలో నగరవాసులూ ఉండటంతో జూబ్లీహిల్స్ సహా వివిధ పోలీసుస్టేషన్లలో ఇప్పటికే ఆరు కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా శనివారం కొందరు బాధితులు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రికవరీలపై దృష్టిపెట్టారు.
Advertisement