శక్తివంతమైన రెండు బాంబులు లభ్యం
ధర్మపురి (హొసూరు), న్యూస్‌లైన్:
జిలిటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైర్లు ఏర్పాటు చేసిన రెండు భారీ బాంబులను సోమవారం సాయంత్రం ధర్మపురి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ధర్మపురి జిల్లా మత్తూరు సమీపంలోని కోడియూరు రోడ్డు మీదుగా పాపిరెడ్డిపట్టి, బొమ్మిడి ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆ రోడ్డులో వెళ్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు ఓ సంచి నుంచి బయటకు వచ్చిన ఎరుపురంగు కేబుల్స్ కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని అతడు కడత్తూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశాడు.
సీఐ భాస్కర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వాటిని పరిశీలించి.. జిల్లా ఏస్పీ హాస్‌రాకర్‌కు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకొని.. సిబ్బంది సహకారంతో వైర్లను తొలగించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కో దానికి 10 జెలిటిన్ స్టిక్‌లు, డిటోనేటర్, వైర్ జోడించిన శక్తివంతమైన బాంబులుగా తేలింది. ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో నక్సల్స్ కదలికలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బాంబులు బయట పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, విద్యాశాఖ మంత్రి పళనియప్పను హతమారుస్తామంటూ రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. మూడు రోజుల క్రితం ఆయన ధర్మపురి జిల్లా కడత్తూరులో ‘తాళికి బంగారం’ సమావేశానికి ప్రజా సంక్షేమ శాఖ మంత్రి వళర్‌మతితోపాటు హాజరయ్యారు.
సమావేశం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ బాంబులు లభ్యం కావడంతో పోలీసు శాఖ కలవరపాటుకు గురైంది. భారీ స్థాయిలో క్వారీ పేలుళ్ల కోసం వీటిని తీసుకెళ్తూ.. ఎవరైనా పోలీసులను చూసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.