
హైదరాబాద్: ఒక్కసారిగా పేలుళ్లు.. దట్టంగా లేచిన దుమ్ము.. భారీ శబ్దాలకు పగిలిన పొరుగు ఇంటి కిటికీలు.. భయంతో స్కూల్ విద్యార్థుల పరుగులు.. చుట్టుపక్కల 400 మీటర్ల మేర గాలిలోకి లేచిన రాళ్లు.. ధ్వంసమైన కార్లు. ఇదీ సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 48లో చోటు చేసుకున్న బీభత్స దృశ్యం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లో ప్లాట్ నంబర్ 969లో సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ భవన నిర్మాణపనుల్లో భాగంగా రాళ్లు పగలగొట్టే పనిని ఆశిష్ అనే వ్యక్తి కాంట్రాక్ట్‌కు తీసుకున్నాడు. అతడు మహేందర్ అనే సబ్ కాంట్రాక్టర్‌కు రాళ్లను కొట్టే పనిని అప్పగించాడు.
ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను పెద్ద మొత్తంలో ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఉదయం వాచ్‌మన్ ఆశారాం భార్య భగవతి గది ముందు వంట చేస్తుండగా వేడికి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ గది కుప్పకూలింది. గాలిలోకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి ఎదురుగా ఉన్న వీరేన్‌చౌదరి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. నాలుగు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రాళ్లు ఎగిరి అక్కడే ఉన్న ఓ కారుపై పడడంతో అది ధ్వంసమైంది. పేలుళ్ల శబ్దాలకు భయపడి సమీపంలోని చిరక్ ప్లేస్కూల్ చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాంబు డిస్పోజల్ టీమ్, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించాయి. పేలని 98 డిటోనేటర్లు, బండరాయిని ధ్వంసం చేసేందుకు పెట్టిన మరో డిటోనేటర్‌ను బాంబుస్క్వాడ్ వెలికి తీసిందని పోలీసులు తెలిపారు. సుమారు 25 డిటోనేటర్లు పేలి ఉంటాయని పోలీసుల అంచనా. ఈ మేరకు పోలీసులు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment