రక్తమోడిన దేవరగట్టు
రక్తమోడిన దేవరగట్టు
Published Wed, Oct 12 2016 6:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
- కొనసాగిన కర్రల సమరం
- ఒకరి పరిస్థితి ఆందోళనకరం
- 30 మందికి పగిలిన తలలు
- ఆరుగురికి కాలిన గాయాలు
- ఫలించని అధికారుల వ్యూహం
- వైభవంగా మాళమల్వేశ్వరుల కల్యాణం
హొళగుంద/ఆలూరు/ఆలూరు రూరల్: దేవరగట్టులో కర్రల సమరాన్ని ఆపేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దసరా సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి హొళగుంద మండలంలోని దేవరగట్టు..కర్రల సమరంతో రక్తమోడింది. బన్ని ఉత్సవంలో 30 మంది భక్తులకు తలలు పగిలాయి. ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆలూరు మండలం తుంబళబీడు గ్రామానికి చెందిన మఠం చిన్న తిక్కయ్య అనే భక్తుని పరిస్థితి విషమంగా ఉంది. ఆటవిక సంస్కృతికి స్వస్తి చెప్పాలని 15 రోజులుగా పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 600 కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సమరాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం 1000 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. అయినా వేల సంఖ్యలో కదన రంగానికి కట్టెలతో భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది.
సమరం సాగిందిలా..
పోలీస్ వ్యూహ రచనలను తిప్పికొట్టేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు బన్ని ఉత్సవాన్ని గతేడాది కంటే 20 నిమిషాల ముందే ముందే ప్రారంభించారు. అర్ధరాత్రి 11:55 గంటల సమయంలో కలిసిగట్టుగా ఉత్సవాన్ని నిర్వహించుకుందామని పాలబాస చేశారు. అనంతరం గట్టుపైకి వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ, డప్పుల శబ్దంతో ఒక్కసారిగా వేలసంఖ్యలో కట్టెలను పట్టుకుని దైవసన్నిధికి చేరుకున్నారు. శ్రీ మాళమల్లేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవుని విగ్రహాలను పల్లకిలో ఉంచి..కొండ దిగే సమయంలో జైత్రయాత్ర ప్రారంభమైంది. కాగడాలను చేతబట్టి, ఇనుప రింగులు తొడిగిన కర్రలను గాలిలోకి తిప్పుతూ భక్తులు నృత్యం చేస్తూ ముందుకు సాగారు. అప్పటికే మొగలాయి ఆడుతున్న అరికెర, సుళావాయి, బిలేహాల్, నిట్రవట్టి, సమ్మతగేరి, అరికెరతండా, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు ఉత్సవమూర్తుల ఊరేగింపులో కలిశారు. విగ్రహాలను మల్లప్ప గుడిలోనే సింహాసనం కట్టమీద అధిష్టించే సమయంలో కర్రలు ఆకాశంలోకి ఒక్కసారిగా లేచాయి. జైత్రయాత్రలో విగ్రహాలకు రక్షణగా నిలిచిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట మూడు గ్రామాల భక్తులు దిక్కులు కిక్కటిల్లేలా 'డ్రూర్ గొబారక్...బహూపరాక్' అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది.
ఏఎస్‌ఐకి గాయాలు..
గాయాలైన భక్తులు పసుపు(బండారం) అంటించుకుని పగిలిన తలలతోనే కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామాలకు చెందిన రంగయ్య, ఈరప్ప, మఠం చిన్నతిక్కయ్యతో పాటు మరో 27 మందికి తలలు పగిలాయి. జయరాముడు, శివతో పాటు మరో నలుగురి భక్తులకు కాలిన గాయాలయ్యాయి. ఉత్సవానికి బందోబస్తుగా వచ్చిన తియోఫిలాస్ అనే ఏఎస్‌ఐ (ఏఆర్) మీదకు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆయన భయాందోళనకు గురై కిందికి పడిపోయాడు. గాయపడిన ఏఎస్‌ఐని పోలీస్‌సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో చేర్చారు. బన్ని ఉత్సవంలో గాయపడిన భక్తులను, ఉత్సవాలకు వచ్చి వివిధ కారణాలచేత అస్వస్థతకు గురైన సిబ్బందిని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరామర్శించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో వైద్యసేవలను డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీదేవిని వారు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
రక్త సంతర్పణ
కర్రల సమరం పాదాల గట్టు, ముండ్లబండ మీదుగా ఆలయానికి సుమారు 4 కి.మీ. దూరంలోనే దట్టమైన అడవిలో ఉన్న రాక్షసపడి( పెద్ద గుండ్లు) వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంచాభీర వంశానికి చెందిన భక్తుడు తమ ఎడమకాలు తొడలో దబ్బణం గుచ్చుకుని అక్కడి నుంచి వచ్చిన రక్తాన్ని మని, మళ్లాసురులుగా పిలిచే రాతి గుండ్లకు సమర్పించాడు. అక్కడి నుంచి శమీ వృక్షం మీదకు చేరుకున్న మాళమల్లేశ్వరుల విగ్రహ మూర్తులకు పూజలనంతరం ఎదురుబసవన్న గుడి వద్దకు తీసుకొచ్చారు.
భవిష్యవాణి
ఎదురుబసవన్న గుడి దగ్గర ఆలయ ప్రధాన అర్చకులగా వ్యవహరించే కుటుంబంలో ఒకరైన గిరిస్వామి గుడి పైకెక్కి భవిష్యవాణిని వినిపించారు. ఈ ఏడాది వివిధ పంటలకు గిట్టుబాటు ధరలో హెచ్చు తగ్గులో ఉంటుందన్నారు. పత్తి క్వింటం ధర రూ.4 వేలు పైగా, జొన్న రూ.1600కు పైగా ధర పలుకుతుందని ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువగా ఒకే వైపు కురుస్తాయని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు, పంటల దిగుబడుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు.
తగ్గిన భక్తుల రద్దీ
సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కన్నా ఈ యేడాది ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. బన్ని ఉత్సవంలో పాల్గొనే దాదాపు 15 గ్రామాల్లో మొహర్రం జరుగుతండడమే ఇందుకు కారణం.
స్వామిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ కుటుంబ సభ్యులు
మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలకు కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ దంపతులు, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దంపతులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అక్కడే ఉండి బన్ని ఉత్సవాన్ని తిలకించారు.
– నేడు రథోత్సవం
మాళమల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. రథోత్సవంలో భాగంగా ఉదయం నెరణికి గ్రామ భక్తుల ఆధ్వర్యంలో పురోహితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
డ్రోన్ పర్యవేక్షణ..
బన్ని ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. దానికితోడు మాళమల్లేశ్వరస్వామి సన్నిధానంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. బన్ని ఉత్సవం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన 'బన్ని ఉత్సవం.. సమస్యల సమరం' అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
గాయపడిన భక్తుల కోసం ఇరవై పడకల ఆస్పత్రిని అనుకూలమైన ప్రదేశానికి మార్చారు. ఎక్సైజ్ పోలీసులు వెయ్యిమంది దాక గస్తీ నిర్వహిస్తూ నాటుసారా విక్రయాలను పూర్తిగా అరికట్టారు.
Advertisement
Advertisement