ఫైల్ ఫొటో
సాక్షి, కర్నూలు: జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో పోలీసుల భద్రత నడుమ బన్నీ ఉత్సవం జరిగింది. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుమారు రెండు లక్షల మంది జనం బన్నీ తిలకించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరానికి దిగారు. ఈసారి బన్నీ ఉత్సవంలో 50 మందికిపైగా (సుమారు 80 మందికి) గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా వర్షంలోనే బన్నీ ఉత్సవాన్ని తిలకించారు జనాలు. మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. దసరా రోజున ప్రతి ఏటా శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా ఈ కర్రల సమరం నిర్వహిస్తున్నారు.
ఉత్సవ వివరాలు
► 5న బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం
► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు
► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు
► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది.
► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి.
► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి: దేవరగట్టుకు భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...!
Comments
Please login to add a commentAdd a comment