sticks fight
-
ఖరీదు సాంబయ్య.. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట
సాక్షి, గుంటూరు(పెదకాకాని): మన భారతీయ సంస్కృతిలోని ప్రాచీన కళల్లో కర్రసాము ఒకటి. కర్రసామే శ్వాస, ధ్యాసగా జీవిస్తూ పతకాల పంట పండిస్తున్నాడు ఖరీదు సాంబయ్య(చంటి). జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని అదరకొడుతున్నాడు. దేశవాళీ క్రీడ అయిన కర్రసాములో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా రక్షించుకుంటూ పది మందికీ నేర్పించాలని తపన పడుతున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఖరీదు సాంబయ్య వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి నాగేంద్రమ్మ. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకున్న సాంబయ్య పలు ప్రైవేటు కళాశాలల్లో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. కర్రసాముపై ఉన్న మమకారంతో ఉపాధ్యాయవృత్తికి స్వస్తి చెప్పి ఉదయం గోరంట్ల శివార్లలో చెట్ల కింద, సాయంత్రం వెనిగండ్ల పంచాయతీ కార్యాలయం వద్ద పిల్లలకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. భార్య రాధిక, 11 ఏళ్ల గీతామాధురి, 10 ఏళ్ల కావ్యశ్రీ సంతానం. ఏడాదిన్నర కాలంలోనే దేశ విదేశాలలో జరిగిన కర్రసాము పోటీల్లో పాల్గొని 32 గోల్డ్‌మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 3 కాంస్య పతకాలు సాధించాడు. ఏడాదిన్నర కాలంలో సాధించిన కొన్ని విజయాలు.. ►2021 మార్చి 21 నెల్లూరు జిల్లాలో 6వ స్టేట్‌లెవల్ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్, సర్టిఫికెట్ ►2021 ఆగస్టు 10 కర్నూలు జిల్లాలో జరిగిన కిక్ బాక్సింగ్‌లో భాగమైన మొదటి ఆంధ్రప్రదేశ్ కర్రసాము పోటీలలో బ్రాంజ్‌మెడల్, సర్టిఫికెట్. నేషనల్ లెవల్లో జరిగే గోవా పోటీలకు అర్హత ►2021 సెప్టెంబరు 5 నెల్లూరు జిల్లా సిలంబం స్టిక్ పెన్సింగ్ అసోసియేషన్ వారు –మేజర్ ధ్యాన్‌చంద్ సర్టిఫికెట్, యూనివర్సిల్ ఎచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ ►2021 సెప్టెంబరు 26 మద్రాస్ సిలంబం ఆఫ్ ఇండియా అసోసియేషన్ వారు వరల్డ్ రిఫరీగా సెలక్ట్ చేసి సర్టిఫికెట్, షీల్డ్‌తో సన్మానం ►2021 నవంబరు 14 కృష్టా జిల్లాలో జరిగిన మొదటి స్టేట్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన కర్రసాము పోటీల్లో గోల్డ్‌మెడల్. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే నేషనల్ ట్రెడిషనల్ లాఠీ స్పోర్ట్స్ పోటీలకు అర్హత ►2021 డిసెంబరు 25 మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన 2వ నేషనల్ ట్రేడిషనల్ లాఠీ స్పోర్ట్స్ చాంపియన్íÙప్ 2021 పోటీలలో గోల్డ్‌మెడల్ మెడల్. ►2022 ఫిబ్రవరి 13 ఎక్స్లెంట్ వరల్డ్ రికార్డ్స్ వారు ఉత్తరాఖాండలోని హరిద్వార్‌లో ద్రోణాచార్యుడి అవార్డు ►2022 మార్చి 27 వైఎంకే 2022 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ నేషనల్ ఓపెన్ కుంగ్‌పూ కరాటే చాంపియన్ íÙప్, కర్రసాము పోటీలలో గోల్డ్‌మెడల్ ► 2022 మే 8 కాకినాడలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి కర్రసాము పోటీలలో కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్ ►2022 మే 14 రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ఆల్ ఇండియా కర్రసాము చాంపియన్‌షిప్ 2022 నేషనల్ లెవల్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. నేపాల్‌లోని ఖాఠ్మాండ్లో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక ►2022 మే 28న ఖాఠ్మాండ్లో జరిగిన ఇండో–నేపాల్ ఇంటర్ నేషనల్ గేమ్స్ వారు నిర్వహించిన కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. ►2022 జూన్ 26 రాజమండ్రిలో నిర్వహించిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్ వారు నిర్వహించిన కర్రసాము ఆన్లైన్ పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో మూడు గోల్డ్‌మెడల్స్. ►2022 జులై 27 నేపాల్ రాజధాని ఖాఠ్మాండ్లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సౌత్ ఏషియన్ లాఠీ చాంపియన్ షిప్ కర్రసాము పోటీలలో ఒక కర్ర, రెండు కర్రలు, ఫైటింగ్ విభాగాలలో ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ ►2022 సెప్టెంబర్ 2 ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన నేషనల్ లెవల్ కర్రసాము పోటీలలో ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్. ►2022 నవంబరు 13 తెలంగాణ యూసఫ్‌గూడలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్ 2022 పోటీలకు 14 మంది శిష్యులతో పాల్గొనగా ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో 32 మెడల్స్ వచ్చాయి. వాటిలో గోల్డ్‌మెడల్స్ 18, సిల్వర్ మెడల్స్ 9, బ్రాంజ్ మెడల్స్ 5 రావడం తనకు ఓవరాల్ చాంపియన్‌షిప్ కప్ అందజేసి సన్మానించడం మరపురాని గొప్ప అనుభూతిగా ఆయన ఆనందాన్ని తెలియజేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి... కర్రసాములో ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో దాతల సహాయ సహకారాలు ఎన్నటికీ మరవలేను. ప్రస్తుతం గోరంట్లలో చెట్ల కింద, వెనిగండ్లలో తిరుమలరెడ్డి స్థలంలో కర్రసాము శిక్షణ ఇస్తున్నాను. మొదట్లో పిల్లలకు ఉచితంగానే నేరి్పంచా. అద్దె ఇల్లు కుటుంబ పోషణ భారంగా మారింది. దాతల సహకారంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బ్యాచ్‌ల వారీగా బాల బాలికలకు, యువతీ యువకులకు ఉచితంగా కర్రసాము మెలకువలు నేరి్పంచి తీర్చిదిద్దుతా. కర్రసాములో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉండేలా కృషి చేస్తా. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డిని కలవగా శాప్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. – ఖరీదు సాంబయ్య(చంటి), కర్రసాము శిక్షకుడు, గుంటూరు పతకాల పంట కర్రసాముగా పిలుచుకునే ఈ క్రీడను తమిళనాడులో సిలంబం, కేరళలో కలరిపట్టు, మధ్యప్రదేశ్‌లో ట్రెడిషనల్ లాఠీ వంటి పేర్లతో పిలుస్తున్నారు. కర్రసాముపై ఉన్న ఆసక్తితో తాను నేర్చుకొని పతకాలు సాధించడంతో పాటు మరికొందరికి కర్రసాములో శిక్షణ ఇస్తూ పతకాలు పంట పండిస్తున్నాడు. సాంబయ్య మాస్టార్ 2022 నవంబరు 13న తెలంగాణలోని యూసఫ్‌గూడలో జరిగిన కర్రసాము పోటీలకు 14 మంది శిష్యులతో వెళ్లాడు. ఒక కర్ర, రెండు కర్రలు, సురులు, చైన్పంత్, జింక కొమ్ములు, ఫైటింగ్ విభాగాలలో మొత్తం 32 మెడల్స్ సాధించారు. వాటిలో 18 గోల్డ్‌మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 5 కాంస్యాలు గెలుపొందారు. ఓవరాల్ చాంపియన్ షిప్ కప్పు అందుకోవడంతో పాటు రిఫరీగా, న్యాయ నిర్ణేతగా సర్టిఫికెట్లు అందుకున్నారు. -
దేవరగట్టు: భారీ వర్షంలో బన్నీ ఉత్సవం.. 50 మందికిపైగా గాయాలు!
సాక్షి, కర్నూలు: జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో పోలీసుల భద్రత నడుమ బన్నీ ఉత్సవం జరిగింది. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. సుమారు రెండు లక్షల మంది జనం బన్నీ తిలకించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరానికి దిగారు. ఈసారి బన్నీ ఉత్సవంలో 50 మందికిపైగా (సుమారు 80 మందికి) గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా వర్షంలోనే బన్నీ ఉత్సవాన్ని తిలకించారు జనాలు. మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. దసరా రోజున ప్రతి ఏటా శ్రీమాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకలలో భాగంగా ఈ కర్రల సమరం నిర్వహిస్తున్నారు. ఉత్సవ వివరాలు ► 5న బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇదీ చదవండి: దేవరగట్టుకు భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...! -
ఆర్మీలో మురిసి.. కర్రసాములో మెరిసి.. సిలంబంలో రాణిస్తున్న మహేశ్వరరావు!
సమాజం పట్ల అంకితభావం.. నిత్యం నేర్చుకోవాలనే తపన.. మహేశ్వరరావును విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చాయి. 19 ఏళ్లకే ఆర్మీలో కొలువు సాధించిన అతను అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణతో నిబద్ధతకు నిలువుటద్దంలా కనిపిస్తాడు. పని పట్ల ఓర్పు.. సహచరులను సమన్వయ పరచడంలో నేర్పు అతడి సొంతం. ఇలా అన్నింటా ప్రత్యేకంగా కనిపించే అతడి క్రీడాసక్తి విలక్షణమైనదే. నేటి సమాజంలో దాదాపు మరిచిపోతున్న కర్రసామే అతని అభిమాన క్రీడ. ఆత్మరక్షణ కోసం మన పూర్వీకులు నేర్పిన ఆ క్రీడలో నేడు అతను అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. - ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు) ఆర్మీలో కొలువు సాధించి.. ఆ తర్వాత దూది మహేశ్వరరావుది నగరంలోని డాబాగార్డెన్స్. అప్పారావు, సత్యవతి దంపతుల రెండవ సంతానం. ఆర్మీలో చేరాలని చిన్నప్పుడే లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2002లో అంటే 19 ఏళ్ల వయసులోనే ఆర్మీలో కొలువు సాధించాడు. చెన్నైలోని 11 ఇంజినీరింగ్ రెజ్మెంట్లో సోల్జర్‌గా సేవలందించాడు. 17 ఏళ్ల సుదీర్ఘ సేవలనంతరం 2019లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఆర్మీ సోల్జర్‌గా సేవలందిస్తున్న సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో మహేశ్వరరావు చురుగ్గా పాల్గొనేవాడు. తమిళనాట సిలంబం(కర్రసాము).. అత్యంత ప్రాముఖ్యం ఉన్న క్రీడ కావడంతో ఆకర్షితుడయ్యాడు. ఈ దశలో ఆర్మీలో తన గురువైన రఘు వద్ద అనేక మెళకువలు నేర్చుకుని కర్రసాములోని పలు కేటగిరీలో సత్తా చాటుతున్నాడు. అద్భుతమైన వేదికగా ఏయూ పదవీ విరమణ చేసిన మహేశ్వరరావుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓ అద్భుతమైన వేదికగా నిలిచింది. క్రీడలపై ఆసక్తితో 2019లో ఓ ప్రైవేట్ కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. 2021లో ఏయూ క్రీడా విభాగంలో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)లో అతనికి ప్రవేశం లభించింది. ఏయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ ఆచార్య ఎన్.విజయమోహన్, విభాగాధిపతి డాక్టర్ ఎ.పల్లవి ప్రోత్సాహంతో పలు క్రీడాంశాల్లో నైపుణ్యం పెంచుకున్నాడు. స్పోర్ట్స్ విభాగం నిర్వహించే ఈవెంట్స్‌తో చురుగ్గా పాల్గొంటూ ఆర్మీలో నేర్చుకున్న క్రమశిక్షణ, పనిలో అంకితభావం, ఓర్పుతో సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకిష్టమైన కర్రసాముకు మరింత నైపుణ్యాన్ని జోడిస్తూ వరసగా పతకాలు సాధిస్తున్నాడు. ఆత్మరక్షణలో కీలకం కర్రసాము మన పూర్వీకులు ఆదరించిన గ్రామీణ క్రీడ. భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రలోని అనేక గ్రామాల్లో ఈ క్రీడా ఆనవాళ్లు నేటికి ఉన్నాయి. తమిళనాడులో పుట్టిన ఈ క్రీడ నేడు జపాన్, చైనా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ఈ క్రీడ ద్వారా అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు ఆర్మీలో ఉన్నప్పుడు గ్రహించాను. దీంతో మధురైకి చెందిన కోచ్ రఘు మెళకువలు నేర్చుకున్నాను. శరీర అవయవాల రక్తప్రసరణతో పాటు ఇది అత్యంత పటిష్టమైన స్వీయరక్షణ క్రీడ. మార్షల్‌ఆర్ట్స్‌కు దీటుగా శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. చిన్న కర్రతో పది మందిని నిలువరించే సత్తా ఈ క్రీడకు ఉంది. కొన్ని ప్రక్రియల ద్వారా కర్ర లేకుండానూ స్వీయరక్షణ పొందే వీలుంది. ఇందులో నైపుణ్యత సాధించేందుకు నెల నుంచి 3 నెలల సమయం పడుతుంది. క్రమశిక్షణతో నేర్చుకోవడంతో పాటు ఏయూ ఆచార్యులు, ఆర్మీ గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో అనేక వేదికలపై రాణిస్తున్నాను. ఆసక్తి ఉన్న యువతకు వారాంతాల్లో ఈ క్రీడలో తర్ఫీదు ఇస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు 70875 31301ను సంప్రదించవచ్చు. – దూది మహేశ్వరరావు, ఏయూ విద్యార్థి దూది మహేశ్వరరావు సాధించిన పతకాలివీ.. ►కర్రసాములోని పలు కేటగిరీల్లో మహేశ్వరరావు సత్తా చాటుతున్నాడు. స్టిక్‌ఫైట్ సింగిల్, స్టిక్‌ఫైట్ డబుల్స్‌తో పాటు వాల్ వీచు, రెజ్లింగ్‌లోనూ ప్రతిభ చూపుతున్నాడు. ►2021లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో స్టిక్‌ఫైట్ సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ►2021లో జరిగిన సౌత్ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ► 2021లో డబ్ల్యూఎస్ఎస్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన సిలంబం వరల్డ్‌కప్‌లో సింగిల్స్‌లో 3వ స్థానం, డబుల్స్ లో 4వ స్థానంలో నిలచాడు. ► 2021 వరల్డ్ యూనియన్ సిలంబం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ చాంపియన్ షిప్లో వాల్‌వీచులో బంగారు పతకం సాధించాడు. ► 2022 ఏడాది ఆరంభంలో గుంటూరులో జరిగిన సిలంబం స్టేట్ లెవల్ చాంపియన్‌షిప్‌లో స్టిక్‌ఫైట్ సింగిల్స్‌లో బంగారం, డబుల్స్ లో సిల్వర్, సింగిల్ వాల్‌వీచులో సిల్వర్, డబుల్ వాల్‌వీచులో బంగారు పతకాలు సాధించాడు. ►ఇటీవల కన్యాకుమారి వేదికగా జరిగిన జాతీయస్థాయి సిలంబం ఓపెన్ చాంపియన్‌షిప్‌లో మూడు వెండి, ఒక కాంస్య పతకం సాధించి సత్తా చాటాడు. చదవండి: Suryakumar Yadav: నిరాశకు లోనయ్యాను... ఇక ముందు: సూర్యకుమార్ యాదవ్ -
Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..
అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్మెంట్లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది. శాంతాబాలు పవార్ వయసు 86. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్ అంత పాపులర్. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది. ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్ దేశ్‌ముఖ్ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్. అన్నట్లు ఈ వారియర్ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్ మూవీ ‘సీత ఔర్ గీత’లో నటించింది. -
కర్రల 'సమరం'
కర్ణాటక, దొడ్డబళ్ళాపురం : సాంప్రదాయాలకు, సంస్కృతికీ పెట్టిందిపేరు భారతదేశం...ఇక్కడ ఆచరించే ధా ర్మిక ఆచరణలు పైకి మాఢనమ్మకంలా కనిపించి నా ఆ ఆచరణ వెనుక బలమైన కారణాలు, నేపథ్యం ఉంటాయి. ఇలాంటి ఆచరణలు గ్రామాల్లో అధికంగా కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి ధార్మిక ఆచరణ ఒకటి ఉందంటే అతిశయోక్తి కాదుమరి.. జాతరలో జనం వెర్రెత్తి, కత్తులు, కట్టెలు, మారణాయుధాలు గట్రా చేతబట్టి కొట్టుకుంటూ, జంతువులను వేటాడ్డం మీకు తెలుసా? ...దొడ్డబళ్లాపురం తాలూకాలోని హులికుంటె గ్రామంలో ఇలాంటి జాతరే ఒకటి గత ఆరు వందల సంవత్సరాలుగా ఆచరించబడుతూ వస్తోంది. గురువారం సాయంత్రం హులికుంటలో ఈ జాతరను అత్యంత వైభవంగా ఆచరించారు. నేపథ్యం : జాతరకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను గ్రామస్తులు చెబుతారు. మాగడి తాలూకా ఆరాధ్య దైవం రంగనాథస్వామి, దొడ్డబళ్లాపురం తాలూకా హణబె, చుట్టు పక్కల గ్రామస్తుల ఇష్టదైవం హణబె రంగనాథ, హులికుంటె చుట్టు పక్కల గ్రామస్తుల దేవుడు హులికుంటె రంగనాథస్వామి ముగ్గురూ కలిసి హులి టలో రంగనాథ స్వామి గుడి కట్టించి యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధం ఎందుకు జరిగిందీ గ్రామస్తులు వివరించరు. అది దైవ రహస్యంగా భావిస్తారు. వేట రంగనాథ హూవాడిగ నాయకులను గుర్రాలుగా చేసుకుని సంగీత వాద్యాలతో యుద్ధానికి బయలు దేరతాడు. దారి మధ్యలో చన్నబసవయ్య నపాళ్య వద్ద పాము పుట్టకు పూజలు చేసి, కట్టెలు అంటించి పొగబెట్టి బలి కావాలని గగ్గోలు పెడుతూ ముందుకు సాగుతాడు. ఈ తతంగాన్నే జాతరలో కీలక భాగంగా భావించి ఇప్పటికీ ఆచరించడం ప్రత్యేకత. అక్కడి నుండి కాస్త దూరంలోనే రంగ నాథస్వామికి మంచి వేట దొరికింది. వేట దొరికిన స్థలంలోనే ఒక మండపాన్ని కట్టి ఆ స్వామిని శాంతింపజేయడం జరిగింది. నేటికీ అదే మండపం వద్ద రంగనాథ స్వామికి వేట ముగిసాక ప్రత్యేక పూజలు జరుగుతాయి. అప్పుడు జరిగింది యుద్ధమా? లేక వేటా? అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఈ జాతరను ‘ కోలు బేటె ’ (కట్టెల వేట) జాతరగానే పిలుస్తారు. ఎప్పుడు జరుగుతుంది? : ప్రతి సంవత్సరం డిసెంబరు నెల చివరి గురువారం ఈ జాతర ఆచరిస్తారు. పండిన పంటల కోతలు కోసి ధాన్యాన్ని పొలాల్లోనే సేకరించి ఉంచడం అప్పడు పరిపాటిగా ఉండేది. ధాన్యాన్ని అడవి జంతువులు, ఇతర ప్రాణుల నుండి రక్షించుకునేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు ఇలాంటి వైవిధ్యమైన జాతరకు శ్రీకారం చుట్టారని కూడా చెబుతారు. మరో సమాచారం ప్రకారం ఒకప్పుడు హులికుంట, చుట్టుపక్కల గ్రామాల పరిసరాల్లో దట్టమైన అరణ్యం ఉండేది. డిసెంబరు నెలలో కుందేళ్ల బెడద ఎక్కువగా ఉండేదట. వాటిని నియంత్రించడానికే ఈ వేట పండగ ఆచరిస్తారట. పదిహేను సంవత్సరాల క్రితం వరకూ జాతరలో భాగంగా జనం అడవుల్లో తిరిగి నిజంగానే అడవి జంతువులను వేటాడి తెచ్చి రంగనాథస్వామికి నైవేద్యంగా పెట్టేవారు. అయితే జంతువులను వేటాడ్డం చట్ట విరుద్ధం కావడం వల్ల ఇటీవల జంతువుల వేట కేవలం నామమాత్రానికే మిగిలింది. హలికుంటలోని రంగనాథ స్వామి దేవాలయం నుండి స్వామిని పల్లకీలో ఊనేగింపుగా తీసుకువచ్చి గ్రామం శివాలోగల రంగనాథ స్వామి మండపం వద్ద దించి ప్రత్యేక పూజలు చేసి జాతర ఆచరిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల 160 గ్రామాల ప్రజలు తరలి వస్తారు. కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, కట్టెలు చేతబట్టి జనం సాంకేతికంగా కొట్టుకుంటారు. -
రక్తపు గాయాలతో ఆందోళన
గార/శ్రీకాకుళం సిటీ:జిల్లా పోలీస్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకూర్మం పంచాయతీ డొంకలపేట గ్రామానికి చెందిన 12 మంది తమకు న్యాయం చేయాలని రక్తమోడుతున్న గాయాలతో ఆందోళనకు దిగారు. ప్రత్యర్థి వర్గం దాడిలో గాయాలయ్యాయని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.బీమారావు ఆద్వర్యంలో సీఐలు ప్రసాదు, తిరుపతి, పోలీసులు డీపీఓ కార్యాలయానికి చే రుకుని వారిని రిమ్స్‌కు తరలించారు. తమపై దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని వీరు ఆరోపించారు. డొంకలపేటకు చెందిన పట్నాన చిన్నమ్మడు, వంజరాపు ధనలక్ష్మి, పట్నాన గంగులు, పట్నాన అప్పన్న, పట్నాన రాం బాబు, పి.సూర్యనారాయణ, కలగ అ ప్పారావుతో పాటు మరికొందరు బాధితులు ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ గొడవ.. శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని అటవీ భూముల్లో సుమారు 40 ఎకరాల జీడితోటను వనసంరక్షణ సమి తి పేరిట డొంకలపేట గ్రామానికి చెం దిన 113 మందికి అటవీ శాఖ 2004లో అప్పగించింది. ఏటా జీడితోటపై వచ్చే ఫలసాయాన్ని డొంకలపేటతో పాటు బొద్దవానిపేట, వనుమువానిపేట, నగరాలపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెం దిన రైతులు పంచుకుంటున్నారు. అయితే తోటను కాంట్రాక్టర్‌కు అప్పగించడం, దీనిపై కొందరికి నమ్మకం లేకపోవడం వివాదానికి కారణ మైంది. డొంకలపేట గ్రామస్తులు రికా ర్డులు తమకు అప్పగించారని, ఇకపై తామే సాగు చేసుకుంటామని తీర్మానించారు. దీన్ని మిగిలిన ఐదు గ్రామాల రైతులు ఈ నిర్ణయానికి ఒప్పుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ వివాదం నలుగుతోంది. మధ్యాహ్నం.. గురువారం తోటలోని ఫలసాయం తీ సేందుకు డొంకలపేట రైతులు వెళ్లా రు. మిగిలిన ఐదు గ్రామాల వారు తోటలోకి వెళ్లి వారికి అడ్డుకున్నారు. మధ్యాహ్నం 1 సమయంలో çబొద్దవానిపేట, వనుమువానిపేట, నగరా లపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెందిన రైతులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారని డొంకలపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హస్తంతోనే తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై స్థానిక సీఐ ప్రసాదు, ఎస్ఐ గణేష్, అటవీశాఖ అధికారి శాంతిస్వరూప్ల దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. మితిమీరిన రా జకీయ జోక్యం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రద్దు చేయాలని లేఖ అయితే ఐదు గ్రామాల రైతుల వాదన మరోలా ఉంది. వన సంరక్షణ సమితి ఏర్పాటయ్యాక మిగిలిన గ్రామాలకు చెందిన 65 మందిని సమితిలో చేర్చుకునేందుకు తీర్మానం చేశారని వారు చెబుతున్నారు. గత ఏడాది నుంచే గొడవలు జరుగుతున్నాయని, దీనిపై సమితిని రద్దు చేయాలని కోరుతూ గార పోలీసులు అటవీ శాఖ అధికారులకు లేఖ రాశారని చెబుతున్నారు. రికార్డు సభ్యులే.. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారి సీహెచ్ శాంతిస్వరూప్ మాట్లాడుతూ వన సంరక్షణ సమితిలో రికార్డైన మెం బర్లే హక్కుదారులని, ఫలసాయంపై వారికే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. వీరి మధ్య గతంలోనే సమావేశాలను ఏర్పాట్లు జరిగినా సఫలం కాలేదని తెలిపారు. వీఎస్‌ఎస్‌ను రద్దు చేస్తే నిజమైన హక్కు దారులకు నష్టం జరుగుతుందని అన్నారు. బాధితులకు వైద్య సేవలు.. రక్తపు గాయాలతో ఆందోళన చేస్తున్న వారిని రిమ్స్‌కు తరలించామని డీఎస్పీ బీమారావు తెలిపారు. గ్రామానికి చెందిన వారితో మాట్లాడాలని ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నాం. -
కర్రల సమరానికి స్వస్తి పలుకుదాం
– లోకాయుక్త ఆదేశాలను అమలు చేద్దాం – సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు – కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): విజయదశిమి రోజున దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బన్నీ ఉత్సవంలో కర్రల సమరానికి స్వస్తి పలుకుదామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో బన్నీ ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన 100 ప్రదేశాల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపాలని లోకాయుక్త ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు భక్తులు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించాలన్నారు. కర్రల సమరానికి స్వస్తి పలికే విధంగా కళజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హాలహర్వి, హŸళగొంద మండలాల్లోని నెరణికి, నెరణికి తండా, అరికెర, అరికెర తండా, తదితర 13 గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. మాస్టర్ కంట్రోల్ రూము, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని ఆర్డీఓను ఆదేశించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని, నాటుసారా బట్టీలను ధ్వంసం చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. సారా, మద్యం రవాణను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల పరికరాలతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. దేవరగట్టు, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల్లో 3.6 కిలో మీటర్ల దారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులను వచ్చే నెల5లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని రికార్డు చేస్తామన్నారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. డ్రోన్ కెమెరాలతో ఉత్సవాన్ని చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, దేవాదాయ శాఖ డీసీ గాయత్రీ, ఆదోని ఆర్డీఓ ఓబులేసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.