కర్రల సమరానికి స్వస్తి పలుకుదాం
కర్రల సమరానికి స్వస్తి పలుకుదాం
Published Mon, Sep 26 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– లోకాయుక్త ఆదేశాలను అమలు చేద్దాం
– సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
– కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): విజయదశిమి రోజున దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బన్నీ ఉత్సవంలో కర్రల సమరానికి స్వస్తి పలుకుదామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో బన్నీ ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన 100 ప్రదేశాల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపాలని లోకాయుక్త ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు భక్తులు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించాలన్నారు.
కర్రల సమరానికి స్వస్తి పలికే విధంగా కళజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హాలహర్వి, హŸళగొంద మండలాల్లోని నెరణికి, నెరణికి తండా, అరికెర, అరికెర తండా, తదితర 13 గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. మాస్టర్ కంట్రోల్ రూము, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని ఆర్‌డీఓను ఆదేశించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని, నాటుసారా బట్టీలను ధ్వంసం చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. సారా, మద్యం రవాణను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల పరికరాలతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. దేవరగట్టు, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల్లో 3.6 కిలో మీటర్ల దారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులను వచ్చే నెల5లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని రికార్డు చేస్తామన్నారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. డ్రోన్ కెమెరాలతో ఉత్సవాన్ని చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, దేవాదాయ శాఖ డీసీ గాయత్రీ, ఆదోని ఆర్‌డీఓ ఓబులేసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement