కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టుపై ఈనెల 11న జరిగే ‘బన్ని’ ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా జరిగే ఈ ఉత్సవంలో భాగంగా మాలమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను గ ట్టుపైకి చేర్చే క్రమంలో గ్రామస్తులు కర్రలతో కొట్టుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనిని ఆపాలని అధికార యంత్రాంగం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు పలు చర్యలు ప్రకటించారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో భక్తులు తెచ్చే కర్రలకు ఇనుపచువ్వలు బిగించకుండా చూస్తున్నారు. అంతేకాదు, డ్రోన్లు, సీసీ కెమెరాలను వినియోగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేసి, అవసరమైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పరిస్థితులను నివారించనున్నారు. ఉత్సవం జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యపానం విక్రయాలను నిషేధించారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1300 మంది పోలీసులను ఇక్కడ మోహరించనున్నారు.