
వేస్ట్‌లో ఫస్ట్..!
* బెంగళూరు నగరంలో 35 శాతం వృథా అవుతున్న ఆహార పదార్థాలు
* ‘ఎమర్సన్’ సర్వేలో వెల్లడి
* కోల్డ్ స్టోరేజ్‌ల కొరతే ప్రధాన కారణమంటూ నివేదిక
సాక్షి, బెంగళూరు : ఉద్యాన నగరిగా ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నగరం ఫుడ్ వేస్టేజ్‌లో కూడా ఖ్యాతినార్జించింది. ఒకపూట పచ్చడి మెతుకులు దొరకక ఎంతో మంది అల్లాడుతుంటే న గరంలోని మార్కెట్లకు చేరుతున్న కూరగాయలు, పండ్లు కలిపి 35 శాతం చెత్తకుండీ పాలవుతున్నాయి. నగరానికి చెందిన ఎమర్సన్ స్వచ్ఛంద సంస్థ ‘ఫుడ్ వేస్టేజ్ అండ్ కోల్డ్ స్టోరేజ్’ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం న గరంలోని వివిధ మార్కెట్లకు చేరుతున్న కూరగాయల్లో 20 శాతం, పండ్లలో 15 శాతం ప్రతి రోజూ చెత్తకుండీలోకి చేరిపోతున్నాయి.
కూరగాయలు, పండ్లు ఇలా వృథా అవడానికి కోల్డ్ స్టోరేజ్‌ల కొరత కూడా ప్రధాన కారణమని ఎమర్సన్ తన నివేదికలో వెల్లడించింది. ఇక నగరంలోని ప్రధాన మార్కెట్‌లలో ఒకటైన శివాజీన గర రసల్ మార్కెట్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒక్కో నెలకు 400 టన్నుల పండ్లు, 3,600 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు వస్తుంటాయని మార్కెట్ ప్రతినిధి ఇద్రీస్ వెల్లడించారు. అయితే ఇందులో దాదాపు 50 టన్నుల పండ్లు, 800 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు ప్రతి నెలా వృథా అవుతుంటాయని చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఆకుకూరలు, తొందరగా పాడయ్యే అరటి, కమలా, సపోటా పండ్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.
వేధిస్తున్న కోల్డ్ స్టోరేజ్‌ల కొరత...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డ్‌లతో పాటు నగరంలోని మార్కెట్‌లలో సరైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడంతోనే పండ్లు, కూరగాయలను నిల్వ చేసే అవకాశం లేకుండా పోతోందని ఎమర్సన్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4.07 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వివిధ పంటలు, కూరగాయలు, పండ్ల నిల్వకుగాను దాదాపు 24.04 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌ల ఆవ శ్యకత ఉంది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం 19.97 లక్షల టన్నుల కెపాసిటీ కోల్డ్‌స్టోరేజ్‌ల కొరత ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని రైతులు కూరగాయలు, పండ్లు ఉత్పత్తి అయిన తరువాత నగరంలోని మార్కెట్‌లకు చేరవేయడంలోనే ఎక్కువ శాతం చెడిపోతున్నాయి. ఇక నగరానికి చేరిన ఒకటి రెండు రోజుల్లోనే అవి పూర్తిగా చెడిపోయి చెత్తకుప్పల్లోకి చేరిపోతున్నాయని ఎమర్సన్ తన నివేదికలో పేర్కొంది.
వివాహ సమయాల్లో మరింత వృథా...
ఆహార పదార్థాల వృథా అనేది కేవలం మార్కెట్‌లలోనే కాకుండా వివాహ సమయాల్లో కూడా ఎక్కువగా ఉంటోందని ఎమర్సన్ సర్వేలో వెల్లడైంది. నగరంలో దాదాపు 531 కల్యాణమండపాలున్నాయి. వీటిల్లో ఏడాదికి దాదాపు 84,960 వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాలన్నింటిలో కలిపి ఏడాదికి 943 టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఇదే ఆహారం కనుక సద్వినియోగం అయితే కొన్ని లక్షల మంది అన్నార్తుల ఆకలి తీరుతుంది.
వివాహ సమయాల్లో ఆహార పదార్థాల వృథా ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ప్రస్తుతం నగరంలో జరుగుతున్న అన్ని వివాహ వేడుకల్లోనూ బఫే విధానాన్ని అనుసరించడమేన ంటున్నారు నిపుణులు. ఈ బఫేలో పాల్గొన్న చా లా మంది తాము తినే పదార్థాలకన్నా ఎక్కువ పదార్థాలను తీసుకొని చివరికి వాటిని వృథా చేస్తున్నారు. అందుకే తమకెంత మేర అవసరమో అంతే ఆహార పదార్థాలను ప్లేట్‌లోకి తీసుకోవాలని, ఆహారపదార్థాల వృథాపై ప్రతి ఒక్కరూ జాగృతితో వ్యవహరించినపుడు మాత్రమే ఆహార వృథాను అడ్డుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.