విద్యార్థులను విచారణ చేస్తున్న ఎస్‌ఐ రామకృష్ణ
సాక్షి, బంగారుపాళెం(చిత్తూరు) : చదువు ఒత్తిడి కారణంగా బెంగళూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. దాదాపు వారం రోజుల తరువాత బంగారుపాళెం పోలీసులు తమ కంటబడిన వీరిని ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నగరం అరికిరిలో నివాసం ఉంటున్న శంకర్ కుమారుడు నిఖిల్(14) తొమ్మిదో తరగతి, ధన్‌సింగ్ కుమారుడు అర్జున్‌సింగ్(13) ఏడో తరగతి, భాస్కర్‌రెడ్డి కుమారుడు సందీప్(15) పదో తరగతి, నిషార్‌సోయబ్ కుమారుడు మహమ్మద్ సోయబ్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాల, ట్యూషన్‌లో చదువు ఒత్తిడి కారణంగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నలుగురు విద్యార్థులు కలసి బెంగళూరులో రైలు ఎక్కి కోలార్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం చిత్తూరు చేరుకున్నారు.
మండలంలోని నలగాంపల్లె వద్ద నడచుకుంటూ వస్తున్న నలుగురిని రాత్రి బంగారుపాళెం హైవే పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. చదువు ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇవ్వడంతో వారు బంగారుపాళెం చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు కనిపించకపోవడంతో బెంగళూరులో మూడు పోలీస్‌స్టేషన్లలో వారి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసులు పెట్టినట్లు చెప్పారు. పిల్లలను తమకు అప్పగించడంతో టెన్షన్ తీరిందని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళెం పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment