దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
రాష్ట్రంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యా యి. ఈ మేరకు అంధులకు ఒక శాతం, బధిరులకు ఒక శాతం, డిసేబుల్డ్, మానసిక వికలాం గులకు ఒక్కొక్క శాతం అమలు చేయనున్నారు.
► అమల్లో రిజర్వేషన్
► ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో మూడు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఆ రిజర్వేషన్ పెంపునకు చర్యలు తీసుకుంది. దివ్యాం గుల హక్కుల చట్టం 2016 మేరకు వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తింప చేయడానికి నిర్ణయించారు. ఇందుకు తగ్గ కసరత్తులు ముగియడంతో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇందుకు తగ్గ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మేరకు..1981 నుంచి రాష్ట్రం లోని దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్‌ను అమలు చేస్తూ వస్తున్నట్టు వివరించారు. దివ్యాంగులకు సంక్షేమ బోర్డు, వారికి సదుపాయాల మెరుగు లక్ష్యంగా ముందుకు సాగడమే కాకుండా, ఆ బోర్డు, శాఖలకు ప్రత్యేకంగా కొత్త భవనాల నిర్మాణం సాగినట్టు పేర్కొన్నారు. ఉద్యోగ పరంగా దివ్యాంగులకు మరింత అవకాశం కల్పించడం లక్ష్యంగా ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిని నాలుగు విభాగాలు విభజించడం జరిగిందని వివరించారు.
అంధులకు ఒక శాతం, బధిరులకు మరో శాతం, కాళ్లు, చేతులు దెబ్బ తిన్న వారికి, మానసిక వికలాంగులకు తలా ఓ శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ఈ రిజర్వేషన్ అమలు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటించారు. ముందుగా, సచివాలయంలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో ప్రత్యేక పథకాలు, గ్రామీణాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ విభాగాలతో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆయా శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు.