కేడీఎంసీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
♦ వెల్లడించిన కార్పొరేషన్
♦ లాటరీ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్ల కేటాయింపు
♦ ఎస్సీలకు 12, ఎస్టీలకు 3, ఓబీసీ-33, ఓపెన్ కేటగిరీ-74 సీట్లు
సాక్షి, ముంబై : కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటిసారి మహిళలకు 50 శతం రిజర్వేషన్ కల్పించారు. కార్పొరేషన్ (కేడీఎంసీ) ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. ఎన్నికల తేదీ ఖరార కాకపోయినప్పటికీ రిజర్వేషన్ల కోసం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సంజయ్ జాదవ్ నేతృత్వంలో లాటరీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 122 వార్డుల్లో ఎస్సీలకు 12, ఎస్టీలకు 3, ఓబీసీకి 33, ఓపెన్ కేటగిరీకి 74 సీట్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం వాటా కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సారి ఎన్నికలకు వార్డుల పునర్విభజన చేశారు. విభజనతో కొన్ని వార్డులు గల్లంతయ్యాయి.
మరికొందరి వార్డుల్లో రిజర్వేషన్ల ప్రభావం పడింది. మల్లేశ్ శెట్టి, కైలాశ్ శిందే, సుదేష్ చుడనాయిక్, ప్రమోద్‌పింగలే, రామదాస్ పాటిల్, శ్రీకర్ చౌదరీ, శరద్ పావశే, గణేష్ జాధవ్, దుర్యోదన్ పాటిల్, సంజయ్ పాటిల్, అనంతా గైక్వాడ్, విశ్వనాథ్ రాణే, సునీల్ వైలే, వికాస్ మాత్రే, రమేష్ మాత్రే, విద్యాధర్ భోయిర్, శ్రేయస్ సమేల్, వికాస్ మాత్రే, రాజన్ మరాఠే, మనోజ్ ఘరత్ కార్పొరేటర్లపై రిజర్వేషన్ల ప్రభావం పడిందని చెప్పవచ్చు. ప్రస్తుత మేయర్ కళ్యాణి పాటిల్, డిప్యూటి మేయర్ రాహుల్ దామలే, మాజీ మేయర్ వైజయంతి ఘోలప్, సచిన్ పోటేల వార్డులలో మాత్రం ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వారికి ఊరటనిచ్చాయి.
27 గ్రామాల వ్యతిరేకత..
కళ్యాణ్-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్తగా చేర్చిన 27 గ్రామాలలో కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ 27 గ్రామాల నుంచి 22 కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. అయితే కళ్యాణ-డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌లో తమ గ్రామాలను చేర్చడంపై తీవ్ర గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విషయమై గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామని సంఘర్ష్ సమితి గుజాల్ వజే పేర్కొన్నారు.