సా..ర్‌ర్‌ర్.. కాపురం నిలబెట్టండి!
సా..ర్‌ర్‌ర్.. కాపురం నిలబెట్టండి!
Published Tue, Aug 1 2017 4:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM
వైద్యుడిని వేడుకున్న ఓ బాధితుడు
చికిత్సతో పరిష్కరించిన డాక్టర్లు
సంతోషం పట్టలేక స్వీట్ల పంపిణీ
‘సా..ర్‌ర్‌ర్.. డాక్టర్ గారూ నా కాపురం నిలబెట్టండి’ అని వైద్యుడిని వేడుకున్నాడో బాధితుడు. ‘కాపురాలు కూలిపోయే దశ నుంచి పోలీసులు లేదా లాయర్లయితే కాపాడుతారు, మరి మేమెలా’? అని డాక్టర్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. బాధితుడు తన సమస్యను వివరించి సమస్య పరిష్కరించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఆస్పత్రికి వచ్చి వైద్య బృందానికి స్వీట్లు పంచిపెట్టి.. ‘థాంక్స్ సార్ నా కాపురం నిలబడింది, నా భార్య నన్ను వీడిపోను అని చెప్పింది’ అని కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకూ భార్య భర్తను విడదీసేంతటి రోగం ఏంటో?
చెన్నై: భర్తకు విడాకులు ఇచ్చి భార్య విడిపోయే పరిస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆ కాపురాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో ఈ ఏడాది ఆరంభంలో చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు. ‘‘ సార్.. రాత్రి వేళల్లో నేను పెట్టే గురక భరించలేక నా భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోతానని రోజూ బెదిరిస్తోంది. ఎలాగైనా గురక నుంచి గట్టెక్కించండి’’ అని ప్రాధేయపడ్డాడు. సుదీర్ఘ ప్రయత్నంతో ఏడునెలల తరువాత స్టాన్లీ ఆసుపత్రిలో ఏర్పాటైన ‘స్లీప్ ల్యాబ్’ విభాగం వైద్యులు అతడికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి ఒకరోజు రాత్రంతా ల్యాబ్‌లోనే ఉంచారు. గురక రావడం లేదని నిర్ధారించుకుని.. సదరు వ్యక్తి సమస్య పరిష్కారమైందని ఇంటికి పంపారు. కొన్ని వారాల క్రితం ఆ ఉపాధ్యాయుడు ఆస్పత్రికి వచ్చి తన కాపురం నిలబడిందని చెప్పి స్వీట్లు పంచిపెట్టినట్లు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి ఇఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎమ్‌ఎన్ శంకర్ సోమవారం మీడియాకు తెలిపారు.
ఇది చిన్న సమస్య కాదు..
గురక అనేది వినేందుకు చిన్నపాటి సమస్యే అనిపించినా ఎదుటి వారిని ఎంతో బాధిస్తుందని డాక్టర్ శంకర్ అన్నారు. పైగా గురక పురాణ కాలం నాటి నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోందని తెలిపారు. మగవారు పెట్టే గురక మహిళలను, పిల్లలను ఎక్కువగా బాధిస్తుందని చెప్పారు. గురక వల్ల నిద్రలో ఒక్కోసారి శ్వాస అందక ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. ఈ గురక కాపురాలనే కాదు ఉద్యోగాలను, జీవనోపాధిని సైతం దెబ్బతీయగలదని అన్నారు. చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలోని ఈ విభాగానికి రోజుకు ఐదుగురు రోగులు వచ్చి గురకకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొందరికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, నిత్యకృత్యాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మరికొందరికి గురక నుంచి విముక్తి ప్రసాదించవచ్చని డాక్టర్ వివరించారు.
Advertisement
Advertisement