Snoring Sleep
-
ఆప్నియా... గురక నివారణ ఇలా...
మామూలు గురకకూ, ఆప్నియాకు కాస్త తేడా ఉంటుంది. అదేమిటంటే... గురక వస్తుంటే ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. ఆప్నియా అంటే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అలా ఆక్సిజన్ అందనప్పుడల్లా... మెలకువ వచ్చేలా మెదడు దేహాన్ని ఆదేశిస్తుంటుంది. రాత్రి నాణ్యమైన నిద్ర ఉండకపోవడంతో పగలంతా జోగుతూ డల్‌గా ఉంటారు. ఈ ఆప్నియా రక్తపోటు పెరగడానికి, డయాబెటిస్ బాధితుల్లో చక్కెరలు నియంత్రణలో లేకపోవడానికీ, పక్షవాతానికీ దారితీసే ప్రమాదం ఉన్నందున దాన్ని నివారించుకోవాల్సిన అవసరముంది. ఇలా తగ్గుతుంది... మంచి జీవనశైలితో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు ∙స్థూలకాయం ఉన్నవారు ఆరోగ్యకరమైన వ్యాయామంతో బరువు తగ్గడం ∙ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడం. -
గురక పెట్టొద్దన్నందుకు పొడిచేశాడు
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ దిండుతో గురకకు చెప్పండి గుడ్ బై.. ఇది చాలా స్మార్ట్ గురూ!
ఈ దిండు గురక నివారిణి. దీని మీద తలపెట్టుకుని ఆదమరచి నిద్రించినట్లయితే, గురక బెడద ఉండదు. నిద్రలో అటూ ఇటూ కదిలేటప్పుడు తల ఎటు తిరిగితే అటువైపు ఈ దిండు తనంతట తనే సర్దుకుంటుంది కూడా! అమెరికన్ కంపెనీ ‘ప్యూర్–లెక్స్’ తయారు చేసిన ఈ దిండు ఆషామాషీ దిండు కాదు, చాలా స్మార్ట్ తలదిండు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు నిద్రిస్తున్న వ్యక్తి తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గుర్తిస్తాయి. (ఇదీ చదవండి: బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?) గురక మొదలయ్యేట్లు ఉంటే, గురక నివారించేందుకు వీలుగా ఒకవైపు ఎత్తు పెరగడం, ఒక వైపు ఎత్తు కుదించుకోవడం చేస్తుంది. నిద్రిస్తున్న వ్యక్తి తల సౌకర్యవంతంగా ఉండేలా సర్దుకుంటుంది. గురక సమస్యతో బాధపడేవారికి ఈ దిండు చక్కని పరిష్కారం. దీని ధర 134 డాలర్లు (రూ.11,027). -
అదిరిపోయే డివైజ్, పడుకున్న ఐదు నిముషాలకే గురక పెడుతున్నారా?
నిద్రలో గురక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. గురక పెట్టే వారి కంటే, వారితో కలసి ఒకే గదిలో పడుకునేవారికి మరింత సమస్య. చాలామంది గురక నివారణ కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. వాటి ఫలితం అంతంత మాత్రమే! జీవితాంతం గురకతో బాధపడాల్సిందేనా అని బెంగపడే వారి కోసం తాజా సాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి కెటిల్‌లా ఉంది, దీనితో గురక నివారణేమిటా అనుకుంటున్నారా? నిజమే! ఇది ఎలక్ట్రిక్ కెటిలే! అయితే, కాఫీ, టీలు కాచుకునే కెటిల్ కాదిది. గురక బాధితుల శ్వాసవ్యాయామాల కోసం ఫిన్లాండ్లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కెటిల్ ఇది. ‘వెల్ ఓ2’ పేరుతో రూపొందించిన ఈ కెటిల్ వెలుపలి వైపు ఉండే గొట్టం ద్వారా ఒక్కో విడతకు 10–15 సెకన్ల సేపు గాలి ఊదుతూ వ్యాయామం చేసినట్లయితే, మెడ, ఛాతీ కండరాలు బలపడి గురక బాధ శాశ్వతంగా తప్పుతుందని చెబుతున్నారు. దీని ధర 244.80 డాలర్లు (రూ.19,250) మాత్రమే! -
గురకకూ... ఆప్నియాకూ తేడా ఏంటో తెలుసా?
ఇటీవల బప్పీలహరి మరణం తర్వాత స్లీప్ ఆప్నియా సమస్య గురించి చర్చ జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ‘స్లీప్ ఆప్నియా’ వస్తుంది. గురక ఉన్నంత మాత్రన అది స్లీప్ ఆప్నియా కాకపోవచ్చుగానీ... స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం... అది గురకకు దారితీస్తుంది. అందువల్ల గురక వచ్చేవారు తప్పక అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్లీప్ ఆప్నియా గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈసీ వినయకుమార్‌ను అడిగి తెలుసుకుందాం. ప్రశ్న : అసలు గురక ఎందుకు/ఎలా వస్తుంది? జ: నిద్రలో మన కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అలాగే గొంతు కండరాలు కూడా. అలా గొంతు కండరాలు రిలాక్స్ కావడంతోనే... అవి వేలాడినట్టుగా (ఫ్లాపీగా) అయిపోతాయి. శ్వాసనాళం గొట్టంలా ఉందనుకోండి... అప్పుడు ఎలాంటి శబ్దమూ రాదు. కానీ గొంతు కండరాలు రిలాక్స్ కాగానే అవి గాలి తీసిన ట్యూబులా ముడుచుకుపోయినట్లుగా అయిపోతాయి. దాంట్లోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ.. అందులో ప్రకంపనలు కలుగుతాయి. వాటివల్లనే శబ్దం వస్తుంది. దాన్నే మనం గురక అని పిలుస్తాం. ప్రశ్న : గురకకూ, ఆప్నియాకు సంబంధమేమిటి? జ: అన్ని కండరాల్లాగే నిద్రలో గొంతు కండరాలూ వదులవుతాయి కదా. అలా మూసుకుపోయినట్లుగా ఉన్న శ్వాసనాళం నుంచి గాలి సాఫీగా వెళ్లదు. కొద్దిసేపు మాత్రమే అలా ఉంటే దాన్ని ‘హైపాప్నియా’ అంటారు. ఆ కండిషన్ పది సెకండ్లకు పైగా కొనసాగుతూ ఉంటే దాన్ని ‘ఆప్నియా’ అంటారు. ఈ కండిషన్లో వాయునాళాల్లోకి గాలి వెళ్లదు కాబట్టి... ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు. పైగా అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరగడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్న : గురకకూ... ఆప్నియాకూ తేడా ఏమిటి? జ: గురక ఉన్నవారందరికీ ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. అది ఆరోగ్యపరంగానే కాదు... కుటుంబ బంధాల్లో... ముఖ్యంగా జీవితభాగస్వామికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా సందర్భాల్లో హైపాప్నియా పెద్ద సమస్య కాబోదు. కానీ ఆప్నియా దీర్ఘకాలం పాటు కొనసాగితే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ అందనప్పుడల్లా బాధితులకు మెలకువ వచ్చేలా మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. దాంతో రాత్రంతా నాణ్యమైన నిద్ర ఉండదు. దీన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఫలితంగా పగలంతా వారు జోగుతూ ఉంటారు. అంతేకాదు... రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లకు చక్కెరలు నియంత్రణలో లేకపోవడం, పక్షవాతం రావడం, ఆస్తమా, సీఓపీడీ జబ్బులున్నవాళ్లలో వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెజబ్బులు రావడం వంటి సమస్య లొస్తాయి. అవి హార్ట్ ఫెయిల్ అయ్యే ముప్పును పెంచుతాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలతోనూ మృతి చెందే అవకాశాలూ ఉంటాయి. ప్రశ్న : మంచి జీవనశైలితో మెరుగవుతుందా? జ: మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. (బప్పీ లహరి స్థూలకాయం కూడా ఆయన సమస్యకు దోహదం చేసి ఉండవచ్చు). ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. గురక వచ్చేవారిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అది ఎక్కువ కావడం జీవిత భాగస్వామికీ, కుటుంబ సభ్యులకూ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. ప్రశ్న : ఏ డాక్టర్‌ను కలవాలి? ఎప్పుడు సంప్రదించాలి? జ: వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. అది మామూలు గురకా లేక ప్రమాదకరమైన ఆప్నియా గురకా అన్నది డాక్టర్లు కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. గురక వచ్చేవారు పల్మనాలజిస్టులు/ స్లీప్ స్పెషలిస్టులను లేదా ఈఎన్టీ నిపుణులను సంప్రదించాలి. కారణాలు / నివారణ కొన్ని అలవాట్లు ఆప్నియాకు కారణం కావడంతో పాటు, మరిన్ని దుష్ప్రభావాలు కలిగేలా చేస్తాయి. మద్యం అలవాటు వాటిలో ముఖ్యమైనది. దాంతోపాటు పొగతాగడం, స్థూలకాయం ఆప్నియాను మరింతగా తీవ్రతరం చేస్తాయి.ఈ అలవాట్లను తప్పక మానేయాలి. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ – అంటే బరువు ను ఎత్తు స్క్వేర్తో భాగిస్తే వచ్చే సంఖ్య) ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అది 27 కంటే ఎక్కువ ఉంటే స్లీప్ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. మరీ ఎక్కువ బరువు (మార్బిడ్ ఒబేసిటీ) ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లడం మంచిది. చికిత్స స్లీప్ టెస్ట్‌ల తర్వాత... తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి డాక్టర్లు ‘సీపాప్’ అంటే... ‘కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్–వే’ మెషిన్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఈఎన్టీ నిపుణుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స (వ్యూలో పాలటో ఫారింగోప్లాస్టీ – యూపీపీపీ) అవసరం కావచ్చు. -ఇ.సి వినయ కుమార్ సీనియర్ ఇఎన్‌టి సర్జన్ -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
గురక సమస్యలకు చెక్ పెట్టే హైటెక్ రింగ్
లండన్ : నిద్రలేమి, గురక సమస్యలను నియంత్రించేలా పరిశోధకులు హైటెక్ ఉంగరాన్ని రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ రింగ్‌లో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్‌ను గుర్తించే సెన్సర్లను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధించే స్లీప్ అప్నియాకు రాత్రి వేళల్లో బ్లడ్ ఆక్సిజన్ రీడింగ్స్ పడిపోవడం ప్రధాన సంకేతంగా భావిస్తారు. అత్యాధునికంగా రూపొందిన ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందించే వెసులుబాటు ఉంది. తీవ్ర గురక సమస్యలు గుండె పోటు, స్ర్టోక్లకు దారితీసే క్రమంలో ఈ సమస్యను నివారించేందుకు హైటెక్ రింగ్ ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మూడు రోజులకు ఓసారి ఈ ఉంగరానికి చార్జింగ్ చేస్తే సరిపోతుందని, ముఖ్యంగా ఒంటరిగా నిద్రించే వారికి ఈ హైటెక్ రింగ్ మేలు చేస్తుందని స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ నీల్ స్టాన్లీ చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రానున్న ఈ హైటెక్ రింగ్ ధర దాదాపు రూ 7500 ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
గురక పెడుతున్నాడని..
ముంబై : పెద్ద శబ్ధంతో గురకపెడుతూ తమ నిద్ర లేకుండా చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు జాగారం చేయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. గత గురువారం జబల్పూర్ వద్ద ఎల్టీటీ–దర్భంగ పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. నంబర్–3 ఏసీ కోచ్‌లో రామచంద్ర అనే ప్రయాణికుడు పెద్దగా గురకపెడుతూ నిద్రపోతున్నాడు. ఆ శబ్దంతో తోటి వారికి నిద్రాభంగమైంది. దీంతో వారంతా కలిసి ఆయనతో వాదులాటకు దిగారు. చివరికి రామచంద్ర మెలకువతో ఉండాలని అంగీకారానికి వచ్చారు. దీంతో తోటి వారంతా నిద్రపోతుండగా పాపం రామచంద్ర.. ఆరు గంటలపాటు కునికిపాట్లతో కూర్చోవాల్సి వచ్చింది. -
సా..ర్ర్ర్.. కాపురం నిలబెట్టండి!
వైద్యుడిని వేడుకున్న ఓ బాధితుడు చికిత్సతో పరిష్కరించిన డాక్టర్లు సంతోషం పట్టలేక స్వీట్ల పంపిణీ ‘సా..ర్ర్ర్.. డాక్టర్ గారూ నా కాపురం నిలబెట్టండి’ అని వైద్యుడిని వేడుకున్నాడో బాధితుడు. ‘కాపురాలు కూలిపోయే దశ నుంచి పోలీసులు లేదా లాయర్లయితే కాపాడుతారు, మరి మేమెలా’? అని డాక్టర్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. బాధితుడు తన సమస్యను వివరించి సమస్య పరిష్కరించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఆస్పత్రికి వచ్చి వైద్య బృందానికి స్వీట్లు పంచిపెట్టి.. ‘థాంక్స్ సార్ నా కాపురం నిలబడింది, నా భార్య నన్ను వీడిపోను అని చెప్పింది’ అని కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకూ భార్య భర్తను విడదీసేంతటి రోగం ఏంటో? చెన్నై: భర్తకు విడాకులు ఇచ్చి భార్య విడిపోయే పరిస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆ కాపురాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో ఈ ఏడాది ఆరంభంలో చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు. ‘‘ సార్.. రాత్రి వేళల్లో నేను పెట్టే గురక భరించలేక నా భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోతానని రోజూ బెదిరిస్తోంది. ఎలాగైనా గురక నుంచి గట్టెక్కించండి’’ అని ప్రాధేయపడ్డాడు. సుదీర్ఘ ప్రయత్నంతో ఏడునెలల తరువాత స్టాన్లీ ఆసుపత్రిలో ఏర్పాటైన ‘స్లీప్ ల్యాబ్’ విభాగం వైద్యులు అతడికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి ఒకరోజు రాత్రంతా ల్యాబ్‌లోనే ఉంచారు. గురక రావడం లేదని నిర్ధారించుకుని.. సదరు వ్యక్తి సమస్య పరిష్కారమైందని ఇంటికి పంపారు. కొన్ని వారాల క్రితం ఆ ఉపాధ్యాయుడు ఆస్పత్రికి వచ్చి తన కాపురం నిలబడిందని చెప్పి స్వీట్లు పంచిపెట్టినట్లు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి ఇఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎమ్ఎన్ శంకర్ సోమవారం మీడియాకు తెలిపారు. ఇది చిన్న సమస్య కాదు.. గురక అనేది వినేందుకు చిన్నపాటి సమస్యే అనిపించినా ఎదుటి వారిని ఎంతో బాధిస్తుందని డాక్టర్ శంకర్ అన్నారు. పైగా గురక పురాణ కాలం నాటి నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోందని తెలిపారు. మగవారు పెట్టే గురక మహిళలను, పిల్లలను ఎక్కువగా బాధిస్తుందని చెప్పారు. గురక వల్ల నిద్రలో ఒక్కోసారి శ్వాస అందక ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. ఈ గురక కాపురాలనే కాదు ఉద్యోగాలను, జీవనోపాధిని సైతం దెబ్బతీయగలదని అన్నారు. చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలోని ఈ విభాగానికి రోజుకు ఐదుగురు రోగులు వచ్చి గురకకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొందరికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, నిత్యకృత్యాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మరికొందరికి గురక నుంచి విముక్తి ప్రసాదించవచ్చని డాక్టర్ వివరించారు.