stanley medical college
-
సా..ర్ర్ర్.. కాపురం నిలబెట్టండి!
వైద్యుడిని వేడుకున్న ఓ బాధితుడు చికిత్సతో పరిష్కరించిన డాక్టర్లు సంతోషం పట్టలేక స్వీట్ల పంపిణీ ‘సా..ర్ర్ర్.. డాక్టర్ గారూ నా కాపురం నిలబెట్టండి’ అని వైద్యుడిని వేడుకున్నాడో బాధితుడు. ‘కాపురాలు కూలిపోయే దశ నుంచి పోలీసులు లేదా లాయర్లయితే కాపాడుతారు, మరి మేమెలా’? అని డాక్టర్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. బాధితుడు తన సమస్యను వివరించి సమస్య పరిష్కరించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఆస్పత్రికి వచ్చి వైద్య బృందానికి స్వీట్లు పంచిపెట్టి.. ‘థాంక్స్ సార్ నా కాపురం నిలబడింది, నా భార్య నన్ను వీడిపోను అని చెప్పింది’ అని కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకూ భార్య భర్తను విడదీసేంతటి రోగం ఏంటో? చెన్నై: భర్తకు విడాకులు ఇచ్చి భార్య విడిపోయే పరిస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆ కాపురాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా కుంగిపోయిన స్థితిలో ఈ ఏడాది ఆరంభంలో చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు. ‘‘ సార్.. రాత్రి వేళల్లో నేను పెట్టే గురక భరించలేక నా భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోతానని రోజూ బెదిరిస్తోంది. ఎలాగైనా గురక నుంచి గట్టెక్కించండి’’ అని ప్రాధేయపడ్డాడు. సుదీర్ఘ ప్రయత్నంతో ఏడునెలల తరువాత స్టాన్లీ ఆసుపత్రిలో ఏర్పాటైన ‘స్లీప్ ల్యాబ్’ విభాగం వైద్యులు అతడికి చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి ఒకరోజు రాత్రంతా ల్యాబ్‌లోనే ఉంచారు. గురక రావడం లేదని నిర్ధారించుకుని.. సదరు వ్యక్తి సమస్య పరిష్కారమైందని ఇంటికి పంపారు. కొన్ని వారాల క్రితం ఆ ఉపాధ్యాయుడు ఆస్పత్రికి వచ్చి తన కాపురం నిలబడిందని చెప్పి స్వీట్లు పంచిపెట్టినట్లు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి ఇఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎమ్ఎన్ శంకర్ సోమవారం మీడియాకు తెలిపారు. ఇది చిన్న సమస్య కాదు.. గురక అనేది వినేందుకు చిన్నపాటి సమస్యే అనిపించినా ఎదుటి వారిని ఎంతో బాధిస్తుందని డాక్టర్ శంకర్ అన్నారు. పైగా గురక పురాణ కాలం నాటి నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోందని తెలిపారు. మగవారు పెట్టే గురక మహిళలను, పిల్లలను ఎక్కువగా బాధిస్తుందని చెప్పారు. గురక వల్ల నిద్రలో ఒక్కోసారి శ్వాస అందక ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. ఈ గురక కాపురాలనే కాదు ఉద్యోగాలను, జీవనోపాధిని సైతం దెబ్బతీయగలదని అన్నారు. చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలోని ఈ విభాగానికి రోజుకు ఐదుగురు రోగులు వచ్చి గురకకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొందరికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, నిత్యకృత్యాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మరికొందరికి గురక నుంచి విముక్తి ప్రసాదించవచ్చని డాక్టర్ వివరించారు. -
ముక్కులో బొద్దింక.. 12 గంటల పోరాటం
ముక్కులో ఏదైనా చిన్న కాగితం లాంటిది తగిలితేనే భలే చిరాగ్గా ఉంటుంది. దాన్ని తీసేసేవరకు అస్సలు ఊరుకోలేం. అలాంటిది చెన్నైలో ఓ మహిళ ముక్కులో బతికున్న పెద్ద బొద్దింక ఏకంగా 12 గంటల పాటు ఉండిపోయింది. అది కూడా ముక్కు రంధ్రం గుండా... ఏకంగా కళ్ల మధ్య వరకు వెళ్లిపోయింది. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తర్వాత చివరకు మరో పెద్దాస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా ఆ బొద్దింకను బయటకు తీసి ఆమెను కాపాడారు. అలా తీసేవరకు కూడా ఆ బొద్దింక సైతం బతికే ఉండటం గమనార్హం. చెన్నైలోని ఇంజంబాకం ప్రాంతానికి చెందిన సెల్వి (42) మంగళవారం రాత్రి నిద్రపోయినప్పుడు అర్ధరాత్రి ఉన్నట్టుండి ముక్కులో ఏదో దురద పుట్టినట్లనిపించి నిద్రలేచారు. జలుబు వల్ల అలా అయి ఉంటుందనుకున్నానని, కానీ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉండటంతో ఏదో ఉందని భావించానని చెప్పారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ముక్కు లోపల ఏదో పెరిగి ఉంటుందనుకున్నారు. రెండో ఆస్పత్రికి వెళ్లగా నీళ్లను లోపలకు పంప్ చేసి దాన్ని బయటకు తీద్దామనుకున్నారు గానీ కుదరలేదు. మూడో ఆస్పత్రికి వెళ్లగా, ఏదో కదులుతున్న వస్తువు ఉందని చెప్పి, స్కాన్ చేయాలన్నారు. బుధవారం తెల్లవారేసరికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగానికి ఆమెను తరలించారు. అక్కడి వైద్యులు ముక్కుకు ఎండోస్కొపీ చేసి చూడగా.. రెండు యాంటెన్నాల లాంటివి కనిపించాయి. అది పెద్ద బొద్దింకేనని ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎంఎన్ శంకర్ చెప్పారు. ఎట్టకేలలకు వాళ్లు ఒక సక్షన్, ఫోర్సెప్స్ ఉపయోగించి ఆ బొద్దింకను బయటకు లాగారు. అలా దాన్ని బయటకు తీసేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. ఇంతకుముందు కూడా తమ ఆస్పత్రికి ముక్కులో పూసలు, బటన్లు, చాక్ పీసు ముక్కల లాంటివి ఇరుక్కుని వచ్చినవాళ్లు ఉన్నారని, కానీ ఇంత పెద్దది, అందులోనూ బతికున్న బొద్దింకతో పేషెంట్లు రావడం ఇదే మొదటిసారని అక్కడి వైద్యులు చెప్పారు.