దొణెహళ్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | A man in a road accident at donehalli | Sakshi
Sakshi News home page

దొణెహళ్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Published Sat, Jun 14 2014 2:29 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

A man in a road accident at donehalli

  • ప్రైవేటు బస్సు - లారీ ఢీ
  • నలుగురి దుర్మరణం,11 మందికి తీవ్రగాయాలు
  • 15 మందికి స్వల్ప గాయాలు
  • దావణగెరె  :  జగళూరు తాలూకా దొణెహళ్లి వద్ద జాతీయ రహదారి-13పై శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో   నలుగురు దుర్మరణం చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడగా మరో 15 మంది  స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. బీజాపూర్ నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న వీఆర్‌ఎల్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు, చిత్రదుర్గం నుంచి హొస్పేటకు వెళుతున్న లారీ తెల్లవారుజామున 4గంటల సమయంలో దొణెహళ్లి వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి.

    ప్రమాద తీవ్రతకు వాహనాలు ఒకదానికొకటి లోపలకు చొచ్చుకొని పోయి నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో లారీ డ్రైవర్ శ్రీనివాస్(60), అతనికుమారుడు నాగరాజ్(30), బస్సు డ్రైవర్ శివానంద(36), బస్సులో ప్రయాణిస్తున్న కస్తూరి(60) శకలాల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడేమృతి చెందగా  11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 15 మం స్వల్పంగా గాయపడ్డారు.

    జగళూరు సీఐ తిప్పేస్వామి, ఎస్‌ఐ మల్లికార్జున్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు పార్వతి తిప్పేరుద్రగౌడ పటేల్, శ్రీనినాధ్‌రామ్, నింగానంద, శివానంద, సిద్ధనగౌడతోపాటు స్వల్పగాయాలైనవారిని జగళూరు ప్రభుత్వ ఆస్పత్రికి, చంద్రప్రభు, అశోక్, చెన్నబసవరాజు, అరుణ్‌కుమార్, నిఖిల్ మోఘ, అశోక్ పటార్‌ను చిత్రదుర్గం ఆస్పత్రికి తరలించారు.

    అనంతరం రెండు వాహనాలను క్రేన్ల సహాయంతో విడదీసి ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిట్రాఫిక్ స్తంభించడంతో వాటిని రోడ్డు పక్కకు మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాద ఘటనపై జగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
     
    తరచు ప్రమాదాలు: మూడు రోజుల క్రితం ఇక్కడకు సమీపంలోని హిరేమల్లనహొళె క్రాస్ వద్ద లారీ, ట్రాక్టర్ ముఖాముఖి ఢీకొని నలుగురు మృతి చెందారు.ఆ ఘటన కళ్లముందు కనిపిస్తుండగానే తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. తరచుగా దొణెహళ్లి, హిరేమల్లనహొళె, కాననకట్టె క్రాస్‌ల మధ్య ప్రమాదాలు జరుగుతున్నా  నివారణకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికారం చర్యలు చేపట్టలేదని ప్రయాణికులు వాపోతున్నారు.

    నాలుగులేటన్ల రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు పక్కనున్న చెట్లను నరికివేసినా పనులు ప్రారంభించచకపోవడం, రహదారి పక్కనున్న గ్రామాలకు వెళ్లే రోడ్ల వద్ద సూచన ఫలకాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని దొణెహళ్లి గ్రామస్తులు ఆరోపించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement