మళ్లీ చర్చలు!
Published Fri, Feb 7 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
శ్రీలంక - తమిళ జాలర్ల మధ్య మళ్లీ భేటీకి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులో మలివిడత చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. తొలి విడత చర్చల అనంతరం కూడా రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుండడంతో డీఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఎంపీ ఇళంగోవన్ బృందం బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయింది.
సాక్షి, చెన్నై: కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులతో పాటు జాలర్లను పట్టుకెళ్లి కారాగారాల్లో బంధిస్తున్నారు. పడవల్ని స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. దీంతో రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం, డీఎంకే వర్గాలు ఒత్తిడి పెంచాయి. ఎట్టకేలకు కొన్నేళ్ల తర్వాత గత నెల 27న చెన్నై వేదికగా చర్చలు మొదలయ్యూ. అయితే, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్ని మాత్రం గోప్యంగా ఉంచారు. రెండు దేశాల జాలర్ల ప్రతినిధులు చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసినా, శ్రీలంక నావికాదళం మాత్రం తనప్రతాపాన్ని చూపుతూనే ఉంది.
ఆగని దాడులు: చర్చలు విజయవంతం అయి నా, రాష్ట్ర జాలర్ల మీద దాడులు మాత్రం ఆగలేదు. చర్చల అనంతరం ఐదు సార్లు కడలిలో రాష్ట్ర జాలర్లపై దాడి జరిగింది. 88 మందిని, పదికి పైగా పడవలను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లింది. దీంతో ఆ చర్చలు ఏఏ అంశాల చుట్టూ సాగాయో, వాటికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని ప్రకటించాలన్న డిమాండ్‌తో జాలర్లు ఆందోళన చేశారు. జాలర్లపై దాడుల పరంపర కొనసాగుతోండటంతో సీఎం జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి లేఖల ద్వారా పీఎంకు జాలర్ల వెతల్ని ఏకరువు బెట్టారు. తన ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి కరుణానిధి పంపించారు. ఉత్తర చెన్నై ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని ఐదుగురితో కూడిన ప్రతినిధుల బృందం గురువారం ఉద యం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయింది. జాలర్లపై కొనసాగుతున్న దాడుల్ని వివరిస్తూ వినతి పత్రం సమర్పించింది. దాడులకు అడ్డుకట్ట వేయడం, రెండు దేశాల మధ్య సాగిన చర్చల సారాంశాన్ని బయట పెట్టించాలని, శ్రీలంక అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యకు ముగింపు పలకాలని విన్నవించారు.
ఏర్పాట్లు: శ్రీలంక జాలర్ల ప్రతినిధులు ప్రకటించిన మేరకు మళ్లీ చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. గత నెల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలకు శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తమిళుల డిమాండ్లకు తలొగ్గిన ఆ దేశ ప్రభుత్వం, కొన్ని మెలికలతో కూడిన కొత్త అంశాల్ని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. వీటన్నింటిపై చర్చించి, రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలి విడతగా రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరులో ఈ చర్చలు జరగడం ఖాయమని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి రజిత సేన ప్రకటించారు. మూడు తేదీలు ఎంపిక చేసి భారత ప్రభుత్వానికి పంపుతామని, కొలంబో వేదికగా మలి విడత చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారానైనా జాలర్లపై దాడులు ఆగేనా, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే!
Advertisement
Advertisement