తమిళులకు అధికారాలు ఇవ్వాలి
శ్రీలంక తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను ఇవ్వాలి
* 13వ రాజ్యాంగ సవరణను అమలుచేయాలి
* భారత జాలర్లను ప్రోత్సహించాలి: ఉగ్రవాదంపై సమష్టిపోరు
* భారత-శ్రీలంక చర్చల్లో ప్రధాని మోదీ
* ఆరోగ్య, అంతరిక్ష విజ్ఞాన ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళులకు మిగతా పౌరులతో సమాన హక్కులు కల్పించాలని, వారికి న్యాయం చేయాలని, శాంతితో గౌరవప్రదంగా జీవించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను కోరారు.
జాతి ఆధారిత మైనారిటీ వర్గంగా ఉన్న తమిళులకు రాజ్యాంగపరంగా అధికారాలను సంక్రమింపజేయాలని ఆయన మంగళవారం అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా పోరాడటంతో పాటు, ఇరుదేశాల మధ్య భద్రత, సుస్థిరతల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. శ్రీలంకలో వరుసగా నాలుగోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత తొలి విదేశీ పర్యటనగా భారత్‌కు వచ్చిన విక్రమసింఘేను మోదీ ప్రశంసించారు.
భారత్, శ్రీలంకల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే దిశగా ఇరుదేశాల ప్రధానుల మధ్య విస్తృత ప్రాతిపదికన మంగళవారం చర్చలు జరిగాయి. తమిళులకు న్యాయం చేయటం పైనే ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ, రెండు దేశాల నడుమ సుదీర్ఘంగా నలుగుతున్న జాలర్ల సమస్య, వ్యాపార, రక్షణ వ్యవస్థల బలోపేతం, ఉగ్రవాదం, సముద్రజలాల సరిహద్దుల భద్రత వంటి అంశాలను కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరా యి. వైద్య-ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష విజ్ఞానంలో పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
చర్చల అనంతరం మోదీ, విక్రమ సింఘేలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రక్షణ, భద్రత అంశాలలో పరస్పరం నిబద్ధతతో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ‘‘ఇరు దేశాల మధ్య రక్షణ ప్రయోజనాలను మేం గుర్తించాం. భద్రతా శిక్షణ రంగంలో భారత్‌కు అతి పెద్ద భాగస్వామి అయిన శ్రీలంకతో ఈ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. తమిళులతో పాటు, శ్రీలంక ప్రజలంతా సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవాలతో జీవించాలి. రాజ్యాంగపరంగా వారికి దక్కాల్సిన అధికారాలను అందించాలి.
జాలర్ల సమస్యకు సంబంధించి రెండు దేశాల జాలర్ల సంఘాలు కలిసికట్టుగా చర్చించుకుని పరిష్కారాన్ని అన్వేషించాలి. ఈ అంశాన్ని మానవీయ కోణంలో చూడాలని నేను విక్రమ సింఘేకు తెలిపాను. సముద్ర జలాల్లో మరింత లోతుల్లో చేపల వేటకు భారత జాలర్లను శ్రీలంక ప్రభుత్వం ప్రోత్సహించాలి’’ అని మోదీ తెలిపారు. ఆర్థిక భాగస్వామ్యం అంశంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని, వచ్చేఏడాదికల్లా తుదిరూపుకొస్తుందని మోదీ అన్నారు.
శ్రీలంకలో మౌలిక వనరులు, ఇంధన, రవాణా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మోదీ అన్నారు. శ్రీలంక ప్రధాని విక్రమసింఘే మాట్లాడుతూ, రాజ్యాంగం పరిధిలో తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. శ్రీలంకలో మైనారిటీలో ఉన్న తమిళులకు అధికారాలను సంక్రమింపజేయటం కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని భారత్ చాలాకాలంగా శ్రీలంకను కోరుతోంది. 1987లో అప్పటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే, అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీల మధ్య జరిగిన ఒప్పందం మేరకే 13వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం తమిళులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు కొన్ని అధికారాలను ఇవ్వాల్సి ఉంటుంది.
సంగక్కరకు అభినందనలు
క్రికెట్ రంగం నుంచి ఇటీవలే రిటైర్ అయిన శ్రీలంక క్రీడాకారుడు కుమార సంగక్కరను మోదీ ప్రశంసించారు. సంగక్కర గొప్ప బ్యాట్స్‌మన్ అని.. శ్రీలంకతరఫున అతని ఆట చూడలేకపోవటం లోటేనని ఆయన అన్నారు. ‘మనం ఇటీవలే శ్రీలంకతో టెస్ట్‌సిరీస్ పూర్తి చేసి వచ్చాం.. ఇకపై గ్రేట్ కుమార సంగక్కరను మిస్‌అవుతున్నాం’ అని ఆయన అన్నారు.
భారత్-లంకల మధ్య వారధి.. భారత్ శ్రీలంకల మధ్య రూ. 34 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన సముద్ర రహదారి, సముద్రగర్భం లో సొరంగ మార్గ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఓడరేవుల మంత్రి నితిన్ గడ్కారీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో మంగళవారం చర్చించారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం ఖరారైతే, శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత సరిహద్దులోని ధనుష్కోటి దాకా 22 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు.