పెట్టుబడిదారీవ్యవస్థకు కాదు ఆశ్రీత పక్షపాతానికే వ్యతిరేకం
పెట్టుబడిదారీవ్యవస్థకు కాదు ఆశ్రీత పక్షపాతానికే వ్యతిరేకం
Published Tue, Feb 18 2014 12:30 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ఆశ్రీత పక్షపాతానికే తమ పార్టీ వ్యతిరేకమని, అంతేతప్ప పెట్టుబడిదారీవ్యవస్థకు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. నగరంలో సోమవాం జరిగిన సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. వ్యాపారం చేయడం ప్రభుత్వ కర్తవ్యం కాదని, తప్పనిసరిగా పరిపాలనపైనే దృష్టి సారించాలన్నారు. ‘మేము పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. స్పెక్ట్రమ్‌ను రూ. 1.5 లక్షల కోట్లకు కొనుగోలు చేసి, దానిని ఒక వారం వ్యవధిలో రూ. 6,000 కోట్లకు విక్రయించడం మమ్మల్ని నిరాశకు లోనుచేసింది. ఇది వ్యాపారం కాదు.
ఇది దోపిడీ’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 49 రోజులపాటు సీఎంగా పనిచేసిన అర్వింద్...విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాలపై కాగ్ ఆడిట్‌కు ఆదేశించారు. అంతేకాకుండా గ్యాస్ ధరల నిర్ణయంలో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీలపై చర్యలకు ఉపక్రమించిన సంగతి విదితమే.‘దేశంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లో కొద్దిమంది దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అటువంటివారికే తాము వ్యతిరేకమని, అందరికీ కాదని స్పష్టం చేశారు. మీరు వ్యాపారాలను మూస్తే ఉపాధి అవకాశాలను ఎవరు సృష్టించగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
అవినీతిరహితం చేస్తాం
అవినీతిరహిత ప్రభుత్వం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అర్వింద్ పేర్కొన్నారు. దేశాన్ని అవినీతిరహితం చేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మన న్యాయవ్యవస్థ జటిలమైనదని, దీంతో అది అసమర్థంగా మారిపోయిందని అన్నారు. తన విధానాలు తప్పుకావచ్చేమోగానీ, అవినీతిరహిత పాలన అందించడమే తన లక్ష్యమన్నారు. విప్లవంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.గడచిన నెలన్నరరోజుల పాలనాకాలంలో ఎంతో చేశామన్నారు. తాను చేసినంత మరేఇతర ప్రభుత్వమైనా చేసిందా అంటూ ఆయన సవాలు విసిరారు. అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల వ్యవధిలోనే విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల ఆడిట్‌కు ఆదేశించానన్నారు. 45 రోజుల వ్యవధిలో అవినీతి తగ్గుముఖం పట్టేవిధంగా చేశామన్నారు.
Advertisement