న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇంకా ప్రముఖ నాయకులు బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ఉత్తేజితపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ సానుభూతి పరుడు, ప్రముఖ సంగీత కళాకారుడు విశాల్ దడ్‌లానీ రూపొందించి ‘పాంచ్‌సాల్ కేజ్రీవాల్’ పాట ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఓటర్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సందర్భంలో కేజ్రీవాల్ బహిరంగ సభల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు దంచేస్తున్నారు. మెట్రో పరిధిలోని ఆయా నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు ప్రచారం డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో, వారి ఇబ్బందులను గురించి వివరిస్తూ, పరిష్కారానికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు.
వచ్చే వారం వాలంటీర్ల మెరుపు ప్రచారం
వచ్చే వారంలో ఆప్ వాలంటీర్లు నగర వ్యాప్తంగా మెరుపు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతలోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ‘అచ్చేదిన్ ఆనే వాలే హై’ అనే నినాదం సత్ఫలితాలిచ్చింది. 2007లో కూడా శివసేన కూడా శకాస్, ర్యాలీలు నిర్వహించి ముంబై మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. పాటలు పార్టీ ప్రచారానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ కారణంగానే ఈ సారి ఆప్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారస్త్రంగా పాటను ఎంచుకొంది.
బ్లూ, ఎల్లో లైన్లలో..
దీంతోపాటు బస్సుస్టాప్‌ల్లో అడ్వర్టైజ్‌మెంట్‌లను ప్రదర్శిస్తోంది. బ్లూ, ఎల్లో లైన్లలో మహిళల రక్షణ ప్రధానాంశంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ రూట్లలో డీఎంఆర్‌సీ సర్వే ప్రకారం అత్యంత రద్దీగా ఉంటాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను ఆకట్టుకునేందుకు బస్‌స్టాప్‌ల్లో పోస్టర్ల ప్రదర్శన దోహదం చేస్తుందని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం కోసం మెట్రో రైళ్లలోని మొదటి కోచ్, చివరి కోచ్‌లపైనే అడ్వర్టైజ్‌మెంట్ల ప్రదర్శన ఇస్తున్నామని, అందుకే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆ రెండు లైన్లను వినియోగించుకొంటున్నామని నాయకులు పేర్కొన్నారు. పార్టీ వాలంటీర్ మాట్లాడుతూ..రేడియో అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా యువతీయువకుల ప్రధాన సమస్యలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, విద్యుత్, పానీ సమస్యలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.
27న లక్నోలో ‘ఆప్ తాలీ’
లక్నో: ఆమ్‌ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూనే పార్టీకి అవసరమైన నిధుల సేకరణలో ముందుకు సాగుతోంది. వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం డిసెంబర్ 27వ తేదీన రూ. 11,000లకే ‘ఆప్ తాలీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అరవింద్‌కు అత్యంత సన్నిహితులైన నాయకులు మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, అశుతోష్ నాయకత్వంలో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కార్పొరేట్ దిగ్గజాల నుంచి పార్టీ నిధులు సేకరిస్తున్నాయని అన్నారు. తమ పార్టీ అందుకు భిన్నంగా డిన్నర్‌ల పేరుతో సాధారణ ప్రజల నుంచి నిధులు సేకరిస్తున్నామని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు వైభవ్ మహేశ్వరీ మీడియాకు చెప్పారు.
ప్రచారంలో ఆమ్‌ఆద్మీ కొత్త పుంతలు
Published Tue, Dec 16 2014 10:54 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement