‘ఆప్’ కాంగ్రెస్ ‘బీ’ టీం
Published Wed, Nov 20 2013 12:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగోసారి జరగనున్న ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీ ఓట్లను చీల్చబోతోందన్న వార్తలను తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. క్రమంగా ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఒకటే అన్న ప్రచారాన్ని ముందుకు తెస్తూ బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మంగళవారం నిర్వహించి విలేకరుల సమావేశంలో ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌పార్టీకి ఆమ్‌ఆద్మీ పార్టీ ‘బీ టీం’ వంటిదిగా అభివర్ణించారు. కాంగ్రెస్ చెప్పుచేతల్లోనే ఆప్ నేతలు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అన్నా హజారే పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రచారం చేస్తున్నారని అరవింద్‌కేజ్రీవాల్‌పై గోయల్ మండిపడ్డారు. ‘మేం ఆమ్‌ఆద్మీ పార్టీని కాంగ్రెస్ బీ టీంగానే పరిగణిస్తాం.
కాంగ్రెస్ నాయకుల కనుసన్ననల్లో నడుస్తున్న కేజ్రీవాల్ అన్నాహజారే ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజలను తప్పుదారి పట్టించాల నుకునేవారే చివరికి మూర్ఖులుగా మారడం ఖా యం’ అని పేర్కొన్నారు. జన్‌మంచ్ ద్వారా సామాజిక వేత్త అన్నహజారే పేరిట సేకరించిన రూ.85 లక్షల విరాళాలను అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అన్నా సైతం ప్రశ్నించారని గుర్తు చేశారు. అవినీతి రహిత పార్టీగా చెప్పుకుంటున్న ఆప్ మొదట ప్రకటించిన అభ్యర్థుల్లో 11 మంది అవినీతిపరులు ఉన్నారని గోయల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Advertisement