ఆప్ దగ్గర డబ్బులేదు: కేజ్రీవాల్
ఆప్ దగ్గర డబ్బులేదు: కేజ్రీవాల్
Published Mon, Aug 22 2016 11:40 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
పనాజీ: ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ఆద్మీ పార్టీ దగ్గర డబ్బు లేదని ఆ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం దక్షిణ గోవాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నేతలతో సమావేశమైన కేజ్రీవాల్ ఈ మేరకు వెల్లడించారు. ఒకటిన్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆప్ దగ్గర డబ్బులేదంటే నమ్మడానికి కొంత కష్టంగా ఉంటుందని, కావాలంటే తన బ్యాంకు ఎకౌంట్లు చూపిస్తానన్నారు.
పంజాబ్, గోవాలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల్లో.. ప్రజలు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు తమ పార్టీ ఒక వేదికలా పనిచేసిందని, ప్రస్తుతం ఇదే పరిస్థితి గోవాలో ఉందని ఆయన అన్నారు. గోవా ప్రజలే గోవా ప్రభుత్వాన్ని నడుపుతారని, తమ పార్టీలో హైకమాండ్ కల్చర్ లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవా ఎన్నికల మేనిఫెస్టోను సైతం గోవా ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఒక గంటలో గోవాలో డ్రగ్స్ లేకుండా చేయొచ్చని, అయితే పోలీసులు, రాజకీయ నాయకులు డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Advertisement