ఇంజనీర్‌పై దాడి కేసులో ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) అధికారిపై చేయిచేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులు దేవ్లీ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. తమ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఆప్ ఎమ్మెల్యే, ఆయన మనుషులు దాడి చేశారని డీజేబీ సంగంవిహార్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే జార్వాల్‌ను అరెస్టు చేశామని డీసీపీ కరుణాకరణ్ తెలిపారు.
సంగంవిహార్ ప్రాంతంలో ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న జూనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఎమ్మెల్యే, అతని గూండాలు దాడి చేశారని డీజేబీ ఆరోపించింది. ‘గురువారం ఉదయం ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ ప్రారంభించాం. అయితే డ్రిల్లింగ్‌ను నిలిపివేయవలసిందిగా ఎమ్మెల్యే సన్నిహితుడొకరు అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించకుండా ఏ పని మొదలుపెట్టకూడదని ఆ వ్యక్తి చెప్పాడు. తవ్వకాలను మధ్యలోనే ఆపివేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడమేగాక డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమేర్పడుతుంది. అందుకే అరుణ్‌కుమార్ పనుల కొనసాగింపునకు ఆదేశించారు’ అని డీజేబీ పేర్కొంది. ఆ తరువాత ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే తన మనుషులతో వచ్చి అరుణ్‌కుమార్‌పై చేయిచేసుకున్నారని, ఫలితంగా ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని డీజేబీ తెలిపింది.