చెన్నై, సాక్షి ప్రతినిధి : మధురై జిల్లా తిరుమంగళంలో యాసిడ్ దాడి కి గురై తీవ్రంగా గాయపడిన మీనా (18), అంగాళ ఈశ్వరీ (19)కి ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణియన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. చిన్నపూలాంపట్టికి చెందిన ఉదయసూర్యన్ కుమార్తె మీనా, అదే ప్రాంతానికి చెందిన శంకరపాండియన్ కుమార్తె ఈశ్వరీ ప్రతిరోజు బస్సులో తిరుమంగళం చేరుకుని అక్కడి కామరాజర్ యూనివర్సిటీలో బీఏ (ఇంగ్లీషు) చదువుతున్నారు. ఎప్పటి వలెనే శుక్రవారం సైతం మధ్యాహ్నం కాలేజీ ముగించుకుని ఇంటికి వెళుతుండగా 35 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అక్కడికి చేరుకుని మీనాపై యాసిడ్ పోశారు.
దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఈశ్వరి సైతం గాయపడింది. విద్యార్థినులపై యాసిడ్ పోసిన దుండగులు పరారయ్యూరు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడే కళ్లు తిరిగి పడిపోగా తోటి విద్యార్థులు వారిని మదురై ఆస్పత్రిలో చేర్పించారు. యాసిడ్ ప్రభావంతో మీనాకు 30 శాతం, పరమేశ్వరీకి 15 శాతం శరీరం కాలిపోరుుంది. స్వగ్రామంలో మంచి నడవడిక కలిగిన యువతులుగా వారికి పేరుండడంతో శనివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. బాధిత యువతుల బంధువుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి. ఆస్పత్రి వార్డుల పక్కనే కూర్చుని గుండెలవిసేలా రోదించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
మదురై జిల్లా ఎస్పీ విజయేంద్ర బిదారి ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. విద్యార్థినుల స్వగ్రామానికి చేరుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి వరకు విచారణ సాగించారు. సొంత ఊరిలో వారికి ఎటువంటి సమస్యలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల మీనా వెంటపడుతున్న యువకుడు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తిరుమంగళంలో పోలీసు బృందం శనివారం నాడు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది.
వారిలో ఇద్దరు యువకులు పోలీసు ప్రశ్నలకు సంబంధంలేని సమాధానాలు ఇస్తున్నట్లు గుర్తించారు. వీరి ఫొటోలను బాధిత యువతులకు చూపగా వారు సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. యాసిడ్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, బాధిత యువతులకు 24 గంటల వైద్య పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగిందన్నారు. బాధిత యువతులు పూర్తిగా కోలుకునేందుకు అవసరమైతే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తుందని హామీ ఇచ్చారు.
యాసిడ్ బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ
Published Sun, Sep 14 2014 12:54 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement
Advertisement