కుష్భుకు అందలం
* జయంతి ఎక్కడ
* ఈవీకేఎస్ వ్యూహం ఫలించేనా?
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భును అందలం ఎక్కిం చేందుకు ఏఐసీసీ కసరత్తుల్లో పడింది. ఆమెకు అధికార ప్రతినిధి లేదా, పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినీ గ్లామర్ ద్వారా పార్టీ బలోపేతం లక్ష్యంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ రచిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయోనన్న చర్చ ఆరంభం అయింది. చక్కటి వాక్ చాతుర్యం, అనర్గళంగా పలు భాషల్ని మాట్లాడగలిగిన కుష్భు డీఎంకేలో రాణించినా, అక్కడి రాజకీయాలకు తట్టుకోలేని పరిస్థితి.
ఎట్టకేలకు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తానేమీ ఆషామాషీ నాయకురాలు కాదన్నట్టుగా ఆమె ప్రవేశం ఢిల్లీ పెద్దల సమక్షంలో జరగడం ఇక్కడి కాంగ్రెస్ వాదులను విస్మయంలో పడేసింది. టెన్ జన్‌పథ్ ఆశీర్వాదం, ఆహ్వానం కోసం ఇక్కడి నేతలు నెలల తరబడి ఎదురు చూడటం సహజం. అయితే, పార్టీలోకి వచ్చీరాగానే, టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కడం అధినేత్రి సోనియా గాంధీతో ముచ్చటించడం, వెను వెంటనే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకోవడం, జాతీయ స్థాయి నాయకులు ఆమె ప్రెస్ మీట్‌లో కూర్చోవడం వంటి పరిణామాల్ని చూసిన ఇక్కడి కాంగ్రెస్‌వాదులు, కుష్భు రాష్ర్ట పార్టీలో అధినాయకురాలు అయినట్టున్నారేనని పెదవి విప్పుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగానే కుష్భుకు మంచి గుర్తింపు ఇవ్వడానికి ఏఐసీసీ నిర్ణయించింది.
జయంతి ఎక్కడ: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పరి ణామాలు చోటు చేసుకుంటుంటే, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఏమయ్యారోనన్న ప్రశ్న బయలు దేరింది. ఆమెకు చెక్ పెట్టడం లక్ష్యం గానే కుష్భును తెర మీదకు ఈవీకేఎస్ తీసుకొచ్చినట్టుగా ప్రచారం మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, కేవలం ఢిల్లీ పరిచయాలతో పదవులను దక్కించుకుంటున్న ఆమెను పక్కన పెట్టేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం సిద్ధమయ్యారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈవీకేఎస్ వ్యూహాలు ఫలించేనా : కుష్భుకు బలమైన పదవి అప్పగించడం ద్వారా ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఉపయోగించుకునేందుకు నిర్ణయించిన ఏఐసీసీ అధిష్టానం, ఇక నటుడు కార్తీక్‌ను త్వరితగతిన పార్టీలోకి తీసుకొచ్చే విధంగా ఆదేశాలను ఇచ్చింది. వీరితో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా అవసరం అయితే, ఎన్నికల వేళ కుష్భును అందలం ఎక్కించి మహిళా ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ఈవీకేఎస్ వ్యూహ రచనలు చేసి ఉన్నట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్ వర్గం బయటకు వెళ్లింది. ఇక చిదంబరం, తంగబాలు, ఆర్ ప్రభు తదితర గ్రూపుల్ని కుష్భు ఏ మేరకు అధిగమించి రాష్ట్ర కాంగ్రెస్‌లో రాణిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.