రమ్య నిర్ణయం ఏమిటో!
నటి రమ్య గుర్తుందా? కుత్తు రమ్య అంటే వెంటనే గుర్తుకు రావచ్చు. తమిళం, తెలుగు, కన్నడ అంటూ మూడు భాషల్లోనూ కథానాయికగా నటించించారు. అంతేకాదు రాజకీయవాదిగా కొన్నాళ్లు వెలిగారు. నటిగా 2003లో రంగప్రవేశం చేసిన రమ్య బెంగళూర్ బ్యూటీ. అక్కడ నటిగా పేరు తెచ్చుకున్న రమ్యకు ఆ తరువాత తమిళం తెలుగు భాషల్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. తమిళంలో కుత్తు, గిరి, పోల్లాదవన్, వారణం ఆయిరం చిత్రాల్లో నటించారు. తెలుగులో అభిమన్యు చిత్రంతో పరిచయమైన రమ్య ఈ మూడు భాషల్లోనూ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
ఆ పేరు ప్రఖ్యాతులే ఆమెను రాజకీయాల వైపు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.కర్ణాటకలో యువజన కాంగ్రెస్ సభ్యురాలిగా చేరి 2013 బై ఎలక్షన్స్‌లో రమ్య మాండ్య పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై రాజకీయ పాఠాలు నేర్చుకొస్తానని చెప్పి విదేశాలకు వెళ్లిన రమ్య ఒక ఏడాది తరువాత స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు.మధ్యలో విదేశానికి చెందిన ప్రేమికుడితో షికార్లు కొట్టిన ఈ భామ ఎదుట ఒక నిర్ణయానికి రాలేని మూడు అంశాలు అయోమయంలో పడేశాయట.
పెళ్లా, సినిమాలా, రాజకీయాలా? ఈ మూడింటిలో ఏది రహదారి? దేన్ని ఎంచుకుని ముందుకు సాగాలి? అన్న మీమాంసలో పడ్డారని సినీవర్గాల టాక్.మరో విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి రాక ముందు రమ్య నాలుగు చిత్రాలకు సంతకం చేశారు. అందులో దిల్ కా రాజ్ అనే చిత్రం టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ చిత్ర ప్రచారానికి రావలసిందిగా దర్శకనిర్మాతలు అడుగుతున్నారట. అందుకు అంగీకరించాలా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్నారట రమ్య? ఒకటి కాదు, రెండు కాదు, మూడు పడవల మీద కాలు వేస్తే ఎవరైనా ఇలా తికమక పడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.