‘భీమ్’ పరిధిలోనే గనులన్నీ..
‘భీమ్’ పరిధిలోనే గనులన్నీ..
Published Thu, Aug 25 2016 12:09 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
సింగరేణి పుటల్లో కొత్త జిల్లా
జిల్లాలో అతిపెద్ద సంస్థగా అవతారం
వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
భవిష్యత్తు బంగారుమయం
శ్రీరాంపూర్ : ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే బాసర అమ్మవారు గుర్తొస్తారు. బాసర ఆలయం జిల్లాకు ఐకాన్‌గా నిలిచింది. తర్వాత దట్టమైన అటవీ సంపద, గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాగా ప్రసిద్ధి. తర్వాతి స్థానం సింగరేణిది. కానీ.. ఇప్పుడు కొత్త జిల్లాకు సింగరేణే ఐకాన్‌గా మారనుంది. మంచిర్యాల కొమురంభీం జిల్లా ఏర్పడడంతో ఈ జిల్లా ముఖచిత్రంలో సింగరేణిదే అగ్రభాగం కానుంది. తూర్పులో విస్తరించిన బొగ్గు పరిశ్రమ పూర్తిగా కొమురంభీం జిల్లా పరిధిలోకి రానుంది. దీంతో సింగరేణి పుటల్లో కూడా కొత్త అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్లు సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటిగా ఉండేది. ఇప్పుడు ఆదిలాబాద్ స్థానాన్ని కొమురంభీం జిల్లా ఆక్రమించింది.
తూర్పులో సింగరేణి 3 డివిజన్లు ఉన్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్ గనులు ఉన్నాయి. ఈ మూడు డివిజన్లు కలిపి బెల్లంపల్లి రీజియన్‌గా పిలుస్తారు. రీజియన్ పరిధిలో 14 భూగర్భ గనులు, 6 ఓసీపీలు ఉన్నాయి. సుమారు 22 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా వేలాది మంది సింగరేణి నమ్ముకొని బతుకుతున్నారు. తూర్పు ప్రాంతం మొత్తం నది తీరం సరిహద్దుగా ఉంటే దాని తరువాత ఇందారం మొదలుకొని గోలేటి వరకు వరసగా బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ ఇన్నాళ్లు ఆదిలాబాద్ పరిధిలోకి వచ్చేవి. ఇప్పుడు పూర్తిగా కొమురభీం జిల్లా పరం కానున్నాయి. దీంతో సింగరేణి రికార్డుల్లో జిల్లా పేరు మారనుంది. బ్రిటీష్ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 1927లో బెల్లంపల్లి మార్గన్‌ఫిట్ గని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి జిల్లాలో క్రమేపి విస్తరిస్తూ వచ్చింది. వందేళ్ల నుంచి భౌగోళికంగా ఈ గనులన్నీ ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే కార్యకలాపాలు సాగించాయి.
అభివృద్ధికి బాట వేయనున్న సింగరేణి..
కొత్త జిల్లా అభివృద్ధికి సింగరేణి బాట వేయనుంది. పారిశ్రామికంగా సాధించిన అభివృద్ధితో పరోక్షంగా జిల్లా అభివృద్ధి గడించనుంది. జిల్లాలో 100 ఏళ్లకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. కొత్త జిల్లాకు ఇదే ఆయువు కానుంది. ప్రస్తుత జిల్లాలో కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. బెల్లంపల్లి పరిధిలో శ్రావణ్‌పల్లి ఓసీపీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే అబ్బాపూర్(బెల్లంపల్లి ఓసీపీ 2 ఎక్స్‌టెన్షన్) మొదలైంది. మందమర్రి పరిధిలో కళ్యాణిఖని ఓపీపీ రాబోతుంది. కొత్తగా చేపట్టిన కాసిపేట 2 ఇంక్లైన్ గని నుంచి రెండు నెలల్లో బొగ్గు ఉత్పత్తి రానుంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడ్డ 1200 మెగా వాట్ల జైపూర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును మున్ముందు మరో 600 మెగావాట్లకు పెంచడానికి నిర్ణయించారు. ఇదిలా ఉంటే చెన్నూర్‌లో పరిధిలోని చెన్నూర్-1, చెన్నూర్ 2 గనులు గతంలో మూతపడ్డాయి. ఇవి ఎప్పటికైనా తెరవాలని యాజమాన్యం భావిస్తోంది. గతంలో ఇందులో వదిలేసిన బొగ్గును లోపలే మండించి మిథేన్ (వంటగ్యాస్) తీయడం కోసం సన్నాహాలు చేశారు. దీని కోసం ఓఎన్‌జీసీతో కూడా అవగాహన ఒప్పందం సింగరేణి కుదుర్చుకుంది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్టు ఉంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
సంస్థకు తప్పనున్న ఇబ్బందులు..
జిల్లా కేంద్రం మంచిర్యాల కావడంతో సింగరేణి సంస్థకు పెద్ద ఇబ్బందులు తప్పనున్నాయి. కొత్త ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయాలంటే కలెక్టరేట్, ఫారెస్టు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ సుదూర ప్రాంతం కావడంతో కంపెనీ అధికారులు ఏ చిన్న పనిమీద జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చినా రోజంతా అటే గడిచిపోయేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పనుంది. ఓసీపీ ముంపు గ్రామాల నష్టపరిహారాలను తేల్చడానికి కలెక్టర్లకే అధికారం ఉండడంతో రైతులను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లొచ్చని ఎస్టేట్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు భూముల ధర నిర్ణయాల కోసం రోజుల తరబడి జిల్లా కేంద్రానికి వెళ్లి రావడం ప్రహసంగా ఉంది. నష్టపరిహారాలకు సంబంధించిన ప్రతీ ఫైల్ క్లీయరెన్స్ కోసం ఆదిలాబాద్ కలెక్టర్ వెళ్లి రావడంతో ఏళ్ల కొద్ది జాప్యం జరిగేది. దీంతో తరచూ నిర్వాసితులు గనులను అడ్డుకోవడం చేశారు. ఇప్పుడు గంట సమయంలో కొత్త జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చక్కబెట్టుకోవచ్చని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా చిన్న జిల్లా కావడంతో పనులు త్వరగా అవుతాయని పేర్కొంటున్నారు.
సీఎస్‌ఆర్ నిధులకు మరింత వెసులు బాటు..
కేంద్రం నిబంధనల ప్రకారం సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సాబిలిటీ (సీఎస్‌ఆర్) స్కీం కింద ప్రత్యే క నిధులు కేటాయించి పరిసర ప్రాంతాలకు వెచ్చించాలి. ఇది ఆ పరిశ్రమల ఎఫెక్ట్ ప్రాంతాల్లో ఖర్చు చేస్తారు. కంపెనీకి వచ్చిన లాభాల నుంచి కొంత శాతం నిధులను ఈ స్కీం కింద కేటాయిస్తారు. కొత్త జిల్లాతో పరిధి తగ్గడంతో ఆ నిధులు భీమ్ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి. భవిష్యత్తులో సింగరేణి విస్తరిస్తున్న కొద్దీ.. కొమురంభీం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement