- నిరసనగా కోర్టు కార్యకలాపాలు నిలిపేసిన న్యాయవాదులు
- కోర్టు సమీపంలోనే తమకు రక్షణ లేదని ఆరోపణ
- పదునైన ఆయుధంతో గాయపరచడం వల్లే మృతి
- కేసులో ఒక వ్యక్తి అరెస్ట్.. మరో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగంలో ఓ న్యాయవాది వృతదేహం శుక్రవారం రక్తం మడుగులో లభించింది. తమ సహచరుడు కోర్టు ఆవరణలోనే హత్యకు గురికావడం న్యాయవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. న్యాయవాది హత్యకు నిరసనగా వారు పనులు నిలిపివేసి ధర్నా జరిపారు. శర్మహత్యకు నిరసనగా శుక్రవారం అన్ని విధులు నిలిపివేయాలని ఆల్ డిస్ట్రిక్ బార్ సమన్వయ కమిటీ నిర్ణయించిందని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు చెందిన డీడీవర్మ తెలిపారు.
శుక్రవారం ఉదయం కోర్టు వెనుక భాగాన టి బ్లాక్ లాయర్ల చాంబర్లో ఉన్న దాభా దగ్గర న్యాయవాది రాజీవ్ శర్మ వృతదేహం పోలీసులకు లభించింది. గురువారం రాత్రి దాభా దగ్గర జరిగిన ఘర్షణలో అతను మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై పదునైన ఆయుధంతో గాయపరచడం వల్ల శర్మ ప్రాణాలు పోయి ఉంటాయని వారు చెబుతున్నారు. న్యాయవాది హత్యకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత రాజీవ్ శర్మ తన కుటుంబసభ్యులతో మాట్లాడారని పోలీసులు పేర్కొన్నారు. 38 సంవత్సరాల న్యాయవాది శర్మ రోహిణి ప్రాంత నివాసి అని వారు చెప్పారు. శర్మ వృతదేహం కోర్టు దుస్తులలోనే లభించిందని పోలీసులు చెప్పారు. కోర్టు నుంచి బయటకు రాగానే శర్మ దాభా దగ్గర కొందరు వ్యక్తులతో గొడవ పడి ఉంటాడని, ఈ గొడవ అతని ప్రాణాలు తీసి ఉంటుందని పోలీసులు చెప్పారు. శర్మ హత్య కేసుకు సంబంధించి పోలీసులు జోధ్‌పుర్‌కు చెందిన ధన్నా రామ్ చౌదరిని అరెస్టు చేశారని, దాభాలో పనిచేసే ముగ్గురు పనివారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని అనధికార వర్గాలు తెలిపాయి.
శర్మ హత్యకు గురైన రోడ్డుపై పలువురు లాయర్ల చాంబర్లు ఉన్నాయి. దాభా యజమాని మనోజ్ సింగ్ కూడా న్యాయవాదేనని తెలిసింది. దాభా దగ్గర శర్మ మద్యం సేవించి ధన్నా రామ్ చౌదరితో తీవ్రంగా గొడవ పడ్డాడని, ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసిందని, దాభా పనివారు కూడా ఈ గొడవలో తలదూర్చారని, వారిలో ఒకరు శర్మ తలపై పదునైన వస్తువుతో కొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. న్యాయస్థానం సమీపంలోనే తమ సహచరుడొకరు హత్యకు గురికావడం పట్ల న్యాయవాదులు నిరసన ప్రకటించారు.
ఓ యువ న్యాయవాది కోర్టు పరిసరాలలోనే హత్యకు గురయ్యాడని, అది తీవ్రమైన విషయమని న్యాయవాదులు పేర్కొన్నారు. అతను అంత పొద్దుపోయిన తరువాత దాభా వద్ద ఏంచేస్తున్నాడనేది ఇంకా తేలవలసి ఉందని తీస్‌హజారీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నాసియర్ అన్నారు.
కోర్టు సమీపంలో న్యాయవాది హత్య
Published Sat, Apr 18 2015 12:24 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement