‘సాక్షి’తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానం రూపొందించిన తరవాతే గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పరీక్షా విధానం రూపకల్పన, సిలబస్‌ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీలతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు. కమిషన్‌లో త్వరలో చేపట్టనున్న మార్పులపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణపై రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేస్తుంది. మరో కమిటీ పరీక్షల విధానం, షెడ్యూల్‌పై అధ్యయనం చేసి కమిషన్‌కు నివేదిక ఇస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సిలబస్‌ను ప్రకటిస్తాం. మార్చి తరవాతే గ్రూప్-1, 2 నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. జనవరిలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని సర్వీస్ కమిషన్ చేపట్టే అంశంపై విద్యాశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నాం.
యూపీఎస్సీ తరహా పరీక్షా విధానం
దేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును పరిశీలించిన తరవాతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. అందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫలితాల ప్రకటన తేదీలను పరీక్షకు ముందుగానే ప్రకటిస్తాం. అభ్యర్థుల వ్యక్తిత్వం తెలుసుకునేందుకు సివిల్స్ తరహాలో అదనంగా మరో పేపర్‌ను గ్రూప్-1 పరీక్షలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. గ్రూప్1, గ్రూప్-2 (ఎగ్జిక్యూటివ్) పరీక్షలకు ఇంటర్వ్యూలుంటాయి. నిష్పాక్షికంగా, పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఇంటర్వ్యూకు మార్కులుంటాయి.
కేరళ తరహాలో...
కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా... డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగుల డేటా బేస్ మా వద్ద సిద్ధంగా ఉంటుంది. ప్రతి పరీక్షకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధానం ప్రవేశపెడతాం.
ఇక ఆయా శాఖలో ఏటా ఎన్ని పదవీ విరమణలు (రిటైర్మంట్స్) ఉంటాయో ముందే జాబితా సిద్ధం చేసుకొని వారు రిటైరయ్యే సమయానికి కొత్త అభ్యర్థులు ఆ పోస్టుల్లో చేరే విధంగా పరీక్షలు ముందుగానే నిర్వహించి అభ్యర్థుల మెరిట్ లిస్టు సిద్ధంగా ఉంచుతాం. ఆ శాఖ కోరగానే జాబితాను వారికి అందజేస్తాం. దీంతో తక్షణం ఖాళీల భర్తీ చేయడానికి వీలవుతుంది. మెరుగైన పాలన, సుపరిపాలన అందిస్తాం.
జనవరిలో ఖాళీలపై స్పష్టత
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు అన్ని విభాగాల అధిపతులతో చీఫ్‌సెక్రటరీ సమక్షంలో జనవరిలో కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అప్పుడే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి. ఏ క్యాడర్‌లో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఇక ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఖాళీలను గుర్తించి, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత కమిషన్‌కు అందజేస్తేనే మేం పరీక్షలు నిర్వహిస్తాం. లక్ష ఉద్యోగాలా అంతకంటే ఎక్కువా తక్కువా అన్న అంశం ప్రభుత్వం పరిశీలిస్తుంది.
స్థానికత నిర్థారించేది ప్రభుత్వమే
అభ్యర్థుల స్థానికతను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వం 1956నే ప్రామాణికంగా తీసుకుంటే దాన్నే కమిషన్ అమలుచేస్తుంది.
గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..
Published Sat, Dec 27 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement