మళ్లీ మార్పులు | again changes in asifabad district | Sakshi
Sakshi News home page

మళ్లీ మార్పులు

Published Thu, Oct 6 2016 11:20 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

again changes in asifabad district

తాండూరు, భీమిని, కన్నెపల్లిలు మంచిర్యాల జిల్లాలోకి..
15 మండలాలతో ఆసిఫాబాద్ జిల్లా
మంచిర్యాల జిల్లాలో 18కి చేరిన మండలాలు
ఘనంగా కొత్త జిల్లాల ప్రారంభ వేడుకలు
హాజరుకానున్న పద్మారావు, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త జిల్లాల ప్రతిపాదనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆసిఫాబాద్ జిల్లాలో 18 మండలాలను చేర్చాలని ప్రతిపాదించిన జిల్లా అధికార యంత్రాంగం ఇప్పుడు మళ్లీ మార్పులు చేసింది. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి చేర్చిన బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాలను తిరిగి మంచిర్యాల జిల్లాలోకి మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు మరోమారు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. మూడు మండలాలు తగ్గడంతో ఆసిఫాబాద్ (కుమ్రంభీం) జిల్లా పరిధిలో 15 మండలాలు ఉంటాయి. 15 మండలాలున్న మంచిర్యాల ఇప్పుడు 18 మండలాలు కానున్నాయి. తాజా మార్పులతో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని మండలాన్నీ మంచిర్యాల జిల్లా పరిధిలో ఉండనున్నాయి. తాండూరును ఆసిఫాబాద్ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ తాండూరు మండల వాసులు ఆందోళనకు దిగారు. బుధవారం జాతీయ రహదారిపై రాస్తోరోకో నిర్వహించి, అటువైపు వెళ్లిన కలెక్టర్ ఎం.జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
 
జన్నారంపై తర్జన భర్జన..
జన్నారం మండల విషయంలో కొంత తర్జనభర్జన జరిగింది. ఈ మండలాన్ని మంచిర్యాల జిల్లా పరిధిలో ఉంచాలని ముందుగా నిర్ణయించారు. ఈ మండలంలోని కొన్ని గ్రామాలను దస్తూరాబాద్ (కొత్త మండలం)లో చేర్చి నిర్మల్ జిల్లా పరిధిలో ఉంచాలని భావించారు. కానీ.. మళ్లీ మార్పులు చేసి ఆ గ్రామాలను తిరిగి జన్నారం మండలంలోనే ఉంచుతూ.. ఈ మండలం మొత్తాన్ని మంచిర్యాల జిల్లాలోనే చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్‌కు తేదీ దగ్గర పడుతున్న ఈ తరుణంలో రోజుకొక్కటి అన్నట్లు ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుండటం గమనార్హం.
 
జిల్లాలను ప్రారంభించేది వీరే..
కొత్త జిల్లాల సంబరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దఎత్తున సంబరాలు చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాలను ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మంచిర్యాల జిల్లా ప్రారంభ వేడుకలకు రాష్ట్ర ఎకై్సజ్ శాఖ మంత్రి టి.పద్మారావు ముఖ్య అథితిగా హాజరు కానున్నారు. అలాగే ఆసిఫాబాద్ జిల్లాను మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. నిర్మల్ జిల్లా ప్రారంభ వేడుకలు స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి.
 
ఆసిఫాబాద్‌కు కుమ్రంభీం పేరు అధికారిక ఆదేశాలు
మంచిర్యాల జిల్లాకు పెట్టిన కుమ్రంభీం పేరును ఆసిఫాబాద్ జిల్లాకు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలందాయి. ఇకపై జరిగే ప్రక్రియ అంతా ఆసిఫాబాద్ జిల్లాను కుమ్రంభీం పేరుతో జరపాలని ఆదేశించారు.
 
ఆసిఫాబాద్‌లో కార్యాలయాల వేట..
కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు కానుండటంతో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాల వేటలో పడింది. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఆయా శాఖల జిల్లా కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ రెండు రోజులుగా ఆసిఫాబాద్‌లో పర్యటించి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) భవనంలో తాత్కాలిక కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులోనే సీపీవో, ట్రెజరీవంటి కార్యాలయాలను ఉంచాలని చూస్తున్నారు. నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే జెడ్పీ హైస్కూల్ భవనంలో ఖాళీగా ఉన్న గదుల్లో డీఈఓ కార్యాలయం, గ్రామపంచాయతీ భవనంలో డీపీఓ కార్యాలయం.. ఇలా ఆయా శాఖల కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement