సాక్షి, చెన్నై: వాయిదా పడ్డ స్థానాల రేసులో మళ్లీ పాత అభ్యర్థులకే అన్నాడీఎంకే అవకాశం ఇచ్చింది. అరవకురిచ్చి నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, తంజావూరు నుంచి రంగస్వామి పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల్ని ఎదుర్కొంటున్న మధురై జిల్లా తిరుప్పరగుండ్రం సీటు మాజీ ఎమ్మెల్యే ఏకే బోసుకు దక్కింది. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామిని ఢీ కొట్టేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్ సిద్ధం అయ్యారు.
నగదు బట్వాడా గుట్టురట్టుతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాలకు ఎన్నికలు ఆగిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాలతో పాటుగా శీనివేల్ మరణంతో ఖాళీగా ఉన్న తిరుప్పరగుండ్రం నియోజకవర్గానికి నవంబర్ 19న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో కొత్త వాళ్లకు అన్నాడీఎంకే చోటు కల్పించేనా, లేదా పాత వాళ్లకు అవకాశం ఇచ్చేనా అన్న చర్చ బయల్దేరింది.
ఇందుకు కారణం నగదు బట్వాడా వ్యవహారంతో పాటుగా పాత అభ్యర్థులపై ఫిర్యాదులు, ఆరోపణలు బయల్దేరడమే. ఇక సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానాల రేసులో అన్నాడీఎంకేలో కీలకంగా, జయలలితకు సన్నిహితంగా ఉన్నవాళ్లు బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగింది. అయితే ఆ ప్రచారాలకు, ఆరోపణలు, ఫిర్యాదులకు చెక్ పెడుతూ, మళ్లీ పాత అభ్యర్థులకు అన్నాడీఎంకే అవకాశం కల్పించడం విశేషం. ఆసుపత్రిలో ఉన్న తమ అమ్మ జయలలిత ఆదేశాల మేరకు అభ్యర్థుల జాబితాను అన్నాడీఎంకే కార్యాలయం బుధవారం ప్రకటించింది.పాత వాళ్లకే అవకాశం: 2006, 2011 ఎన్నికల్లో విజయ కేతనం ఎగుర వేసిన సెంథిల్ బాలాజీకి అమ్మ జయలలిత గత ప్రభుత్వ కేబినెట్‌లో చోటు దక్కింది.
ఎన్నికలకు ఏడాది కాలం ఉన్న సమయంలో ఆయన చేతిలో ఉన్న రవాణా శాఖ మంత్రి పదవి ఊడింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు డౌటే అన్న చర్చ సాగుతున్న సమయంలో మళ్లీ సెంథిల్ బాలాజీకి అమ్మ అవకాశం కల్పించారు. అయితే కరూర్ నియోజకవర్గం నుంచి కాకుండా, అరవకురిచ్చి కేటాయించారు. నగదు బట్వాడా గుట్టురట్టుతో ఎన్నికలు వాయిదా పడడంతో మళ్లీ సీటు దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్న సెంథిల్ బాలాజీ మీద మరో మారు జయలలిత కరుణ చూపించారు. అరవకురిచ్చి సీటు ఆయనకే కేటాయించడంతో గెలుపు లక్ష్యంగా ఓటర్ల వద్దకు ఉరకలు పరుగులు తీసే పనిలో పడ్డారు.
తంజావూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న రంగస్వామికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కింది. అయితే ఎన్నికలు కాస్త ఆగడంతో మళ్లీ సీటు ఇస్తారా? అన్న భావనలో ఉన్న రంగస్వామి వర్గంలో ఆనందం వికసించింది. తంజావూరు అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు. ఇక శీనివేల్ మరణంతో ఖాళీ ఏర్పడ్డ తిరుప్పరగుండ్రం సీటు ఆయన వారసుడు సెల్వకుమార్‌కు దక్కుతుందని సర్వత్రా ఎదురు చూశారు. అయితే సెల్వకుమార్‌ను పక్కన పెట్టి ఏకే బోసును తాజాగా రంగంలోకి దించారు. ఏకే బోసు గతంలో పలుమార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అమ్మ జయలలిత దృష్టిలో మంచి అన్న గుర్తింపును కల్గిన వ్యక్తి కావడంతో ఈ సారి సీటు దక్కించుకున్నారు.
నారాయణస్వామితో ఓం శక్తి శేఖర్ ఢీ: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కోసం నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నెల్లితోప్పు అభ్యర్థిగా ప్రపథమంగా ఎన్నికల బరిలో దిగేందుకు సీఎం నారాయణస్వామి సిద్ధం అయ్యారు. ఆయనకు గట్టి పోటీ ఇచ్చేందుకు తగ్గ అభ్యర్థిని అన్నాడీఎంకే బరిలోకి దించింది. గతంలో రెండు సార్లు ఇదే స్థానం నుంచి గెలిచిన ఓం శక్తి శేఖర్‌కు అవకాశం కల్పించారు. దీంతో నారాయణస్వామిని ఓడించి తీరుతానన్న ధీమాతో ఓం శక్తి శేఖర్ ముందుకు సాగుతున్నారు.
ప్రచార జాబితా ఇవ్వండి: రాష్ర్టంలో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వెళ్లే అధికార ప్రతినిధులు, ముఖ్య నేతల వివరాలను ఎన్నికల యంత్రాంగంకు సమర్పించాలని రాష్ట్ర ప్రధాన అధికారి రాజేష్ లఖాని సూచించారు. ముందస్తుగా అనుమతులు తప్పని సరి అని, ఎవ్వరెవ్వరు ఆయా పార్టీల నుంచి ప్రచార బాధ్యతలో ముందుకు సాగుతారో అన్న వివరాలతో కూడిన జాబితాను నవంబర్ రెండో తేదీ లోపు సమర్పించాలని సూచించారు.
మళ్లీ వాళ్లకే!
Published Thu, Oct 20 2016 1:09 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement