అన్నాడీఎంకేలో ఆకాశమంత ఎత్తుకు ఎగిసిన ఆనందం రెండురోజుల్లోనే చప్పున చల్లారింది. అమ్మను ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని ఆశలు పెట్టుకున్నవారంతా ఆశా నిరాశేనా అంటూ దిగాలు పడిపోయారు. అమ్మ సీఎం కావడంపై అనుమానాలు తలెత్తడంతో నిర్వేదంలో కూరుకుపోయారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
అన్నాడీఎంకేలో ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎంజీ రామచంద్రన్ తరువాత జయలలిత ఆ స్థాయిలో ప్రజాభిమానం, పార్టీపై పట్టుసాధించి వీరవనితగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడినా, గెలిచినా ఆమెపై ఆరాధనాభావం ఇసుమంతైనా తగ్గలేదు. అన్నాడీఎంకేలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. పార్టీని నడిపించడంలో ఒకటి నుంచి వంద వరకు జయలలితదే అగ్రస్థానం. అంతటి ప్రజాభిమానం కలిగిన జయకు గత ఏడాది జైలు శిక్షపడినపుడు పార్టీ నేతలు, అభిమానులు తల్లడిల్లిపోయారు. కేసుల నుంచి జయకు విముక్తి లభించాలని, మళ్లీ సీఎం పీఠం ఎక్కాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
ఆరుమాసాలుగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ అమ్మకోసం పూజలు చేసే అన్నాడీఎంకే వారితో నిండిపోయాయి. అన్నాడీఎంకే నేతలు చేసిన పూజలు ఫలించాయి అన్నట్లుగా కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించింది. ఇంకే ముంది అమ్మ అభిమానుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. తీర్పు వెలువడిన 11 వ తేదీన అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాణ సంచాల మోతలతో మరో దీపావళిని సృష్టించారు. అమ్మ సీఎం కాబోతున్నారని జేజేలు పలికారు. పార్టీలోని అగ్రనేతలు సైతం శాసనసభాపక్ష సమావేశం, సీఎం పదవీ ప్రమాణంలపై ఎవరికివారు ముహూర్తాలు పెట్టేసుకున్నారు. పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ముందు అమ్మ కటాక్షం కోసం క్యూకట్టారు.
అందుకే ఆమె ‘అమ్మ’:
తీర్పు వెలువడగానే తన ఇంటి బైటకు వచ్చి జయ అభివాదం కూడా చేయలేదు. అందరిలా ఆలోచిస్తే ఆమె ‘అమ్మ’ ఎందుకవుతుంది, అన్నాడీఎంకే వంటి పార్టీకి మహాసామ్రాజ్ఞి ఎలా నిలుస్తుంది అన్నట్లుగా జయ స్పందించడం ప్రారంభించారు. సీఎం పదవీ ప్రమాణ తేదీ కోసం తహతహలాడుతూ జయ ఇంటికి చేరుకున్నవారిని సున్నితంగా వెనక్కు పంపారు. అమ్మ అంతరంగాన్ని అర్థం చేసుకునే పనిలో పడిన పార్టీవర్గాలకు అప్పీలు వ్యవహారం స్పురణలోకి వచ్చింది. తీర్పుపై విపక్షాలు ఎక్కుపెట్టిన విమర్శలను ఎదుర్కొన్న తరువాతనే సీఎం పదవిని చేపట్టాలని జయ నిర్ణయించేసుకున్నారని తేలిపోయింది. జయను సీఎంగా చూడాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.
రెండురోజులైనా అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాకపోవడం అమ్మ అభిమానులను ఆవేదనకు గురిచేసింది. అమ్మ కేసులో అప్పీలుకు వెళితే సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో అనే ఆందోళన వారిలో నెలకొంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అన్నాడీఎంకేలో ఏర్పడిన అయోమయ పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేస్తోంది. జయ నిర్దోషిగా బైటపడాలని భగవంతుడిని ప్రార్థించిన చేతులు తాజా తీర్పుపై అప్పీలుకు పోకుండా చూడాలని వేడుకోవడం ప్రారంభించాయి.
ఆశ నిరాశేనా
Published Thu, May 14 2015 4:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement