చర్చలకు స్వస్తి
► ఎంజీఆర్ ఉత్సవాలపై దృష్టి
► శశికళ ఫొటోలు తొలగించాలని డిమాండ్
► అన్నాడీంకే విలీనం ఆగిపోయినట్లే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏకం అవుతున్నామంటూ ఇటీవల ఎగిరెగిరి పడిన అన్నాడీఎంకే నేతలు చతికిలపడ్డారు. విలీన చర్చలకు స్వస్థి పలికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలపై దృష్టి పెట్టారు. జయ మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే, ఆర్కేనగర్ ఉప ఎన్నికల అనుభవాలతో తిరిగి ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. రాజీపై పన్నీర్ వర్గం డిమాండ్లు అనేక పిల్లిమొగ్గలు వేసిన తరువాత తమ ప్రథమ శత్రువైన శశికళ, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించడం, జయలలిత మరణంపై సీబీఐ విచారణను కోరడం అనే డిమాండ్ల వద్ద ఆగింది.
శశికళ, దినకరన్ ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులుంటూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకోవాలని ఎడపాడి వర్గంపై పన్నీర్ వర్గం పట్టుపడుతోంది. పన్నీర్ సీఎంగా ఉన్నపుడు జయ మరణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఎడపాడి వర్గం వాదన లేవనెత్తింది. శశికళ అంశం ఎన్నికల కమిషన్ విచారణలో ఉన్నందున తాము హామీ ఇవ్వలేమని ఎడపాడి వర్గం దాటవేయడంతో చర్చలకు పెద్ద విఘాతం ఏర్పడింది. విలీన చర్చలు ఇక ఇప్పట్లో ఉండవనేలా అ«ధికార వర్గం వ్యవహరిస్తోంది. చర్చల ప్రయత్నాలకు తెరదించి జూన్ 8, 9 తేదీల్లో ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాలపై దృష్టి మరల్చారు.
పత్రాలను సమర్పించిన పన్నీరు వర్గం: రెండాకుల చిహ్నం పొందడంలో జూన్ 16వ తేదీలోగా అదనపు డాక్యుమెంట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఇటీవల ఆదేశించింది. ఈ పత్రాల సమర్పణకు మరింత సమయం ఉన్నందున పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎంజీ ఆర్ శత జయంతి ఏర్పాట్లపై ఎడపాడి వర్గాలు దృష్టి పెట్టాయి. అయితే పన్నీర్‌సెల్వం వర్గాలు ఎన్నికల కమిషన్ కోరిన అదనపు డాక్యుమెంట్లను మంగళవారం సమర్పించారు.
మరో బాంబు పేల్చిన మదుసూధనన్: విలీన చర్చలపై ఇప్పటికే ప్రతిష్టంభన నెలకొనగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మధుసూదనన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసి మరో బాంబు పేల్చారు. జయలలిత మరణం వల్ల ప్రజల్లో ఏర్పడిన ఆవేదన ఇంకా తొలగిపోలేదని ఆయన అన్నారు.
జయలలిత మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయి న్యాయం దక్కాల్సి ఉందని చెప్పారు. అమ్మ మరణం తరువాత కనుమరుగు కాకుండా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రజల గళాన్ని విశ్వాసపాత్రులుగా తాము వినిపిస్తున్నామని తెలిపారు. పార్టీని కాపాడుకునే వరకు తమ ధర్మయుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ పవిత్రను కాపాడాలంటే కార్యాలయంలోని శశికళ ఫొటోలను తొలగించక తప్పదని ఆయన చెప్పారు.
లక్ష్యసాధనకు వేర్వేరు మార్గాలు: ఎంజీ రామచంద్రన్ నెలకొల్పిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని తొలగింపజేసుకుని పార్టీని కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇరువర్గాలు విలీన చర్చకు సిద్ధమయ్యారు. ఇరువురం రాజీపడకుంటే రెండాకు చిహ్నం ఎవ్వరికీ దక్కకుండా పోతుందని, ఈ పరిణామంతో ప్రజల నుంచి ఆగ్రహానికి గురికాకతప్పదని ఎడపాడి, పన్నీర్ వర్గాలు భయపడ్డాయి.
ఏదో ఒక కోణంలో రాజీ కుదుర్చుకోవాలని వారం రోజులుగా ప్రయత్నాలు చేశాయి. విలీన చర్యలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు వేసుకున్నాయి. అయితే విలీన చర్చల సారాంశానికి విరుద్ధంగా పరస్పర ఆరోపణలు దిగడం ద్వారా ఇరువర్గాలు చెడగొట్టుకున్నాయి. ఎన్నికల కమిషన్‌కు అదనపు ఆధారపత్రాలను సమర్పించేందుకు ఇంకా కొంత సమయం ఉందని ఎడపాడి వర్గం భావించడం, పన్నీర్‌వర్గం మంగళవారమే సమర్పించేయడం ద్వారా చర్చలకు తావులేకుండా విలీనానికి ఇక శాశ్వతంగా తెరదించారు.