విలీనం.. అనుమానం | AIADMK factions continue blame game ahead of merger talks | Sakshi
Sakshi News home page

విలీనం.. అనుమానం

Published Tue, Apr 25 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

విలీనం.. అనుమానం

విలీనం.. అనుమానం

►  స్వరం మార్చిన పన్నీరు వర్గం
► అభిప్రాయ సేకరణ తరువాతే చర్చలన్న ఎడపాడి వర్గం
►  నేటి నుంచి పార్టీ కార్యదర్శుల సమావేశం


అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీన చర్చలపై ఇరువర్గాల్లోనూ మరోసారి అభిప్రాయ భేదాలు తలెత్తాయి. విలీనంపై అందరి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని సీఎం ఎడపాడి వర్గం, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు ఆమోదం తెలుపుతామని పన్నీర్‌ వర్గం భీష్మించుకోవడంతో పాటూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో మరోసారి బ్రేక్‌ పడింది.

 సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చర్చలు ప్రారంభించాలని రెండు రోజుల క్రితం ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఇరువర్గాలు చర్చల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను వేసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు ఇరువర్గాల కమిటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు కూర్చుని చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చర్చల్లో ఏమేమి మాట్లాడాలనే అవగాహన కోసం సీఎం ఎడపాడి తన ఇంటిలో సీనియర్‌ మంత్రులతో సమావేశమయ్యారు.

కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో మీటింగ్‌ పెట్టుకున్నారు. ఎడపాడి సీఎం అయిన తరువాత ప్రజలకు ఆయనపై అభిమానం పెరిగింది, దీనికి తోడు 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సీఎం పదవిని వదులుకునేది లేదని మంత్రులు, సీనియర్‌ నేతలు స్పష్టం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికల కమిషన్‌ వద్ద విచారణలో ఉన్నందున చర్చల అజెండాలో చేర్చవద్దని వారించారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆర్థిక మంత్రి పదవిని పన్నీర్‌కు అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయకుమార్‌ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య  మళ్లీ నిప్పు రాజేసింది.

డిమాండ్లపై రాజీలేదు
పన్నీర్‌ సెల్వం సైతం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన ఇంటిలో తన వర్గ నేతలతో చర్చలు జరిపారు. సీఎం, ప్రధాన కార్యదర్శుల పదవులు కాదు, పార్టీ, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని పన్నీర్‌వర్గం నేతలు అభిప్రాయపడ్డారు. పన్నీరుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఆయన అంతస్తును తగ్గించాలని ఎడపాడి వర్గం భావిస్తున్నదని వ్యాఖ్యానించారు. శశికళ, దినకరన్‌ నుంచి రాజీనామాలు తీసుకోవాలని, జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని పన్నీర్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి పేర్కొన్నారు.

ఈ రెండు డిమాండ్లను ఎడపాడి వర్గం ఆమోదించిన తరువాతనే చర్చలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విలీన చర్చలకు విఘాతం ఏర్పడింది. ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వంను వై కేటగిరికి భద్రతలోకి తీసుకుంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పన్నీర్‌సెల్వం ప్రాధాన్యతను పెంచుతున్నట్లు తద్వారా కేంద్రం సంకేతాలు ఇచ్చింది.  శశికళ, దినకరన్‌ల నుంచి రాజీనామాలు తీసుకోవడం అంత సులువు కాదు కాబట్టి చర్చలకు శాశ్వతంగా తెరపడినట్లు అనుమానించక తప్పదు.

నేటి నుంచి జిల్లా కార్యదర్శుల సమావేశం
మంగళవారం నుంచి మూడురోజులపాటూ అన్నాడీఎంకే అమ్మ  జిల్లా కార్యదర్శుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సీఎం ఎడపాడి పళనిస్వామి తరఫున రాష్ట్రంలోని కార్యదర్శులందరికి పిలుపునిచ్చారు.

జిల్లా కార్యదర్శులను మూడుగా విభజించి ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడురోజులపాటూ సమావేశాలు జరుపుతారు. రెండాకుల చిహ్నం, ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శి, ప్రిసీడియం చైర్మన్, కోశాధికారి పదవులపై జిల్లా సర్వసభ్య సమావేశాల ద్వారా స్వీకరించిన అభిప్రాయాల్లో సవరణలు చేసేందుకే ఈ సమావేశాలు జరుపుతున్నట్లు సమావేశం. పనిలో పనిగా విలీనంపై కూడా జిల్లా కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement