ఒకట్రెండు రోజుల్లో గుడ్ న్యూస్: పన్నీర్
సాక్షి, చెన్నై : ఏఐడీఎంకే గ్రూపుల విలీన ప్ర్రకియ సాఫీగా సాగుతుందని ఒకట్రెండు రోజుల్లో తమిళనాడు ప్రజలు, పార్టీ శ్రేణులు సంతోషించేలా మంచి నిర్ణయం వెలువడుతుందని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జయలలిత మెమోరియల్ వద్ద విలీనంపై ప్రకటన వెలువడుతుందని భావించగా, చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి పదవి నుంచి పళనిస్వామి వైదొలగాలని పన్నీర్ సెల్వం శిబిరంలోని కొందరు నేతలు కోరడంతో విలీన ప్రక్రియకు గండిపడింది.
అయితే ఏఐఏడీఎంకేలో ఎలాంటి విభేదాలు లేవని, విలీనంపై త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని పన్నీర్ సెల్వం శనివారమిక్కడ స్పష్టం చేశారు. జయలలిత మరణంపై సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపట్టాలని పన్నీర్ సెల్వం గ్రూపు డిమాండ్ చేస్తుండటం, అవినీతి కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టడం కూడా విలీన ప్ర్రకియలో జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు.
శశికళ స్ధానంలో ఆ పదవిని పన్నీర్‌సెల్వంకు కట్టబెట్టాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో వేర్వేరుగా జరిపిన భేటీల అనంతరం విలీన ప్రక్రియ ఊపందుకుంది. బీజేపీకి మద్దతిచ్చే షరతుతో ఇరు గ్రూపుల విలీనానికి కమలనాధులు చొరవ చూపారు.