పళనిస్వామి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి కే పళనిస్వామికి కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆయన తన కారులో నేరుగా విమానం వద్దకు వెళ్లే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ మేరకు రన్ వేకు సమీపంలో ఆగి ఉండే విమానం వద్దకు ఆయన వాహనానికి అనుమతి ఉండేది. పదవి కోల్పోవడంతో సాధారణ ప్రయాణికుడిలా ఆయన బోర్డింగ్ వ్యవహారాలు ముగించుకుని ఆయా విమాన సంస్థల బస్సులో విమానం వద్దకు ప్రయాణించాల్సి ఉంది.
ఇటీవల ఈ ప్రయాణ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పళనిస్వామికి భద్రత కల్పించాల్సిన అవశ్యం విమాన యాన శాఖకు ఏర్పడింది. మదురైలో బస్సు ప్రయాణం సమయంలో ఆయనకు వ్యతిరేకంగా రాజేశ్వరన్ అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పళని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రధాన ప్రతి పక్ష నేత హోదాలో నేరుగా విమానం వద్దకు కారులో వెళ్లేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
రోడ్డు ట్యాక్స్‌కు వ్యతిరేకత..
రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్‌ను పెంచేందుకు కసరత్తులు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదు శాతం మేరకు పన్ను వడ్డనకు సిద్ధమవుతున్నారు. దీనిని వ్యతిరేకంగా పళనిస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన చేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలను వడ్డించినట్టు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రోడ్డు ట్యాక్స్ పెంపుతో సామన్యుడి సొంత వాహన కలను చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారని ఽఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల్ని దోచుకోవడం లక్ష్యంగా డీఎంకే పాలకులు ముందుకెళ్తున్నారని, తక్షణం ఈ ప్రయత్నం వీడాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క భారం ప్రజల నెత్తిన వేయలేదని, ఈ డీఎంకే పాలకులు రెండేళ్లల్లో ప్రజల జేబులు చిల్లు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment