
మళ్లీ తెరపైకి హీరో అజిత్ పేరు!
చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నేపథ్యంలో హీరో అజిత్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకొంది. ఆయన రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. అజిత్ రాజకీయ ప్రవేశానికి అనుకూలంగా చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. పుట్టినరోజు(మే 1) నాడు తన నిర్ణయం వెలువరించాలని కోరుతూ అభిమానులు పోస్టర్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన రాజకీయ ప్రవేశంపై అజిత్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మానసపుత్రుడిగా, రాజకీయ వారసుడిగా అజిత్ పై మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఆయనను తన వారసుడిగా ప్రకటిస్తూ జయలలిత విలునామా కూడా రాశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. జయలలిత మరణించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారన్న చర్చ ఆసక్తికరంగా సాగింది. విదేశాల నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి ఆయన నివాళులు అర్పించి ‘అమ్మ’పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
జయలలిత తనను కొడుకులా చూసుకునేవారని గతంలో చెప్పిన అజిత్... ‘అమ్మ’ మృతి తర్వాత రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినా ఆయన స్పందించలేదు. రాజకీయాల జోలికిపోకుండా సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అజిత్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. జయలలితకు నిజమైన వారసుడు అజిత్ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు.