
లోకాయుక్తపై శెట్టర్ ఆరోపణలు !
బృహత్ బెంగళూరు మహానగర పాలికేలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న లోకాయుక్త తీరుపై రాష్ట్ర శాసన సభ విపక్ష నాయకుడు జగదీష్‌శెట్టర్ అనుమానం వ్యక్తం చేశారు.
పాలికె అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎస్‌పీ బదిలీపై నిలదీత
అది సాధారణ బదిలీల్లో భాగమే అంటూ సీఎం జోక్యం
విపక్షల రాద్ధాంతం అంటూ వ్యాఖ్య
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికేలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న లోకాయుక్త తీరుపై రాష్ట్ర శాసన సభ విపక్ష నాయకుడు జగదీష్‌శెట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా విధానసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. శాసనసభలో సోమవారం కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే జగదీష్‌శెట్టర్ తన స్థానం నుంచి లేచి నిలబడి ‘బీబీఎంపీలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగిన వైనంపై దర్యాప్తు జరుపుతున్న లోకాయుక్త ఎస్పీని బదిలీ చేశారు. కొన్ని దస్త్రాల్లోని సమాచారాన్ని మారుస్తున్నారు. ఈ విషయాలపై లోకాయుక్త దృష్టి సారించలేదనే సమాచారం ఉంది. ఈ విషయమై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలి.’ అని స్పీకర్ కాగోడు తిమ్మప్పను కోరారు. అయితే స్పీకర్ సూచన మేరకు జగదీష్‌శెట్టర్ ఈ విషయంపై మరోసారి చర్చించడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ సమయంలో కలుగుజేసుకున్న స్పీకర్ ‘బీబీఎంపీ అక్రమాలపై ఇప్పటికే లోకాయుక్త దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ సమయంలో చర్చించడం వల్ల దర్యాప్తు విధానం పక్కదారి పట్టే అవకాశం ఉంది. అందువల్ల చర్చ అవసరం లేదు.’ అని పేర్కొన్నారు.
ఈ సమయంలో కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాధారణ బదిలీల్లో భాగంగానే లోకాయుక్త ఎస్‌పీని మరోచోటికి పంపించామన్నారు. ఈ విషయంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అందువల్ల చర్చ అవసరం లేదని పేర్కొన్నారు. ఇందుకు అంగీకరించని శెట్టర్ లోకాయుక్త దర్యాప్తు తీరుపై చర్చ జరిగించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య స్వల్ప వాగ్వాదం నడిచింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ విషయంపై చర్చకు అవకాశం కల్పించలేనని సరైన సమయంలో ఇందుకు అవకాశం కల్పిస్తామనని పేర్కొనడంతో శాసనసభలో పరిస్థితి సద్దుమణిగింది