టార్గెట్..15
► తమిళనాడుపై కమలనాథుల కన్ను
► వచ్చేనెల 10న అమిత్‌షా రాక
► మూడురోజులు తమిళనాడులోనే తిష్ట
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో రాజకీయంగా వేళ్లూనుకునేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. 15 పార్లమెంటు నియోజకవర్గాలపై కన్నేసిన కమలనాథులు ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చేనెల 10వ తేదీన చెన్నైకి చేరుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన పార్టీగా వెలిగిపోతున్న బీజేపీకి దక్షిణాదిపై సైతం పట్టు సాధించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం రాష్ట్రంలో పర్యటించిన నరేంద్రమోదీకి అనూహ్య స్పందన లభించగా, కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఇక్కడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనగా ఇదే అదనుగా బీజేపీ మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నాడీఎంకే చీలడంతో రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు బలమైన ప్రత్యామ్నాయమే లేకుండా పోయింది. బీజేపీ వరుస విజయాల వ్యూహకర్తగా పేరుగాంచిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మరోసారి తన ప్రతాపాన్ని చూపారు. పార్లమెంటు ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉండగా వ్యూహరచనలలో ఇప్పటి నుంచే కార్యోన్ముఖులయ్యారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో 300 స్థానాల లక్ష్యం పెట్టుకుని 282 సీట్లు సాధించారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా పార్టీ నిర్ణయించింది. అయితే బీజేపీ నిర్ణయించుకున్న ఇంత భారీస్థాయి లక్ష్యసాధనకు కేవలం ఉత్తరాది సరిపోదు, దక్షిణాదిలో సైతం బలం పుంజుకోవాలని అమిత్‌షాకు తెలుసు. అందుకే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళలతోపాటు తమిళనాడు రాష్ట్రంపై కూడా దృష్టి సారించారు. ఈ రాష్ట్రాల్లో గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గణనీయమైన సీట్లు దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో ఈలోటును ఎలాగైనా భర్తీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ 130 పార్లమెంటు స్థానాలపై గురిపెట్టగా, ఇందులో తమిళనాడులోని 15 స్థానాలు ఉన్నాయి.
గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే, పీఎంకేలతో పొత్తుపెట్టుకుని బీజేపీ 1.50 లక్షల ఓట్లు సాధించగలిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు దక్షిణ చెన్నై, వేలూరు, శ్రీపెరంబుదూరు, కోయంబత్తూరు, తిరుప్పూరు, శివగంగై, తెన్‌కాశీ, కన్యాకుమారి తదితర 15 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని మొత్తం 39 పార్లమెంటు స్థానాలకు ఇప్పటికే ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తికాగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వీరి పేర్లను విడుదల చేశారు. తరువాతి దశగా అసెంబ్లీల వారీగా ఇన్‌చార్జ్‌లు, ఒక్కో పోలింగ్ బూత్‌కు పది మందితో కూడిన బృందాల నియామకం జరగనుంది. ఈ బృందాల్లో దళితులు, యువతీ యువకులకు సరైన ప్రాతినిథ్యం కల్పించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. వీరందరి ఎంపికను పూర్తి చేసి తుది జాబితాను వచ్చేనెల 30వ తేదీలో బీజేపీ హైకమాండ్ ఆమోదానికి పంపాల్సి ఉంది.
10న అమిత్‌షా రాక: పార్లమెంటు ఎన్నికలకు తమిళనాడు పార్టీని సన్నద్ధం చేసే పనుల్లో భాగంగా వచ్చేనెల 10వ తేదీన అమిత్‌షా చెన్నైకి చేరుకుంటున్నారు. మూడురోజులపాటు రాష్ట్రంలోనే తిష్టవేసి పార్టీ నేతలతో సమావేశాలు జరపనున్నారు. సహజంగా అమిత్ షా ఏ రాష్ట్రంలోనూ మూడు రోజులపాటు వరుసగా ఉండిన సందర్భాలు లేవు. అయితే తమిళనాడులో మాత్రం మూడురోజులపాటు ఉండాలని నిర్ణయించుకోవడం 15 నియోజకవర్గాల గెలుపుపై ఆయన పట్టుదలను చాటుతోంది. అమ్మ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలకు బీజేపీనే కారణమనే భావనతో పెరిగిపోతున్న వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసేలా పలు పథకాలతో అమిత్ వస్తున్నట్లు సమాచారం. ఈ 15 నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రుల పర్యటనలు ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వ విజయాలను, పథాకాలను ప్రచారం చేయించనున్నారు.
బీజేపీకి అడియాసే: విపక్షాల ఎద్దేవా
తమిళనాడు అధికారంలోకి రావాలన్న బీజేపీ ఆశలు అడియాసలేని విపక్షాలు ఎద్దేవా చేశాయి. రాష్ట్రంలో మతవాదాన్ని ప్రోత్సహిస్తూ బలపడాలనే బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ప్రయత్నాలు ఎంతమాత్రం నెరవేరవని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంతో పొత్తుపెట్టుకుని తలకిందులుగా నిల్చుని నీళ్లు తాగినా రాష్ట్రంలో కమలం వికసించదని అన్నాడీఎంకే (అమ్మ) అధికార ప్రతినిధి ఎస్‌ఆర్ బాలసుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు.