సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీజేపీ ముందుకు సాగుతోంది. 60కిపైగా సీట్లు గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్లతోపాటు పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల కోసం అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇక్కడికి వచ్చినపుడు వారితో ప్రచారం చేయించాలని ఈ సందర్భంగా అమిత్‌షా నిర్ణయించారు. తెలుగువారిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జాట్ గ్రామస్తులను బీరేందర్ సింగ్, పూర్వాంచలీయులను బీహార్, ఉత్తరప్రదేశ్ ఎంపీలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. జాతీయ రాజధానిలో చేపట్టనున్న పథకాలను వీలైనంత త్వరగా ప్రారంభించడమే కాకుండా కేంద్రమంత్రులతో వాటికి ప్రారంభోత్సవం చేయించాలని బీజేపీ యోచిస్తోంది.
రహదారులు, విద్యుత్, నీటి సరఫరాతోపాటు మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టుల జాబితాను ఆ పార్టీ నాయకులు రూపొందించనున్నారు. వారంలోగా రూపొందించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో గత వారం జరిపిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించినట్లు తెలిసింది. నగరంలో అమలయ్యే పథకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌తోపాటు సంబంధిత అధికారుల వద్ద నుంచి కేంద్రం సమాచారం తీసుకుందని, సామాన్య ప్రజలతో ముడిపడిన పథకాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి అందించాలని కేంద్రం వారిని కోరిందని అంటున్నారు. ఆ తరువాత ఏ మంత్రి ఏ పథకాన్ని ప్రారంభించాలనేది నిర్ణయిస్తారని అంటున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ ఢిల్లీలో బీజేపీని గెలిపించడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
ఎన్నికల బాధ్యతలు మరో నేతకు
ఇదిలా ఉండగా ఢిల్లీ ఎన్నికల బాధ్యతలను మరో జాతీయస్థాయి నేతకు అప్పగించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గత విధానసభ లోక్‌సభ ఎన్నికల సమయంలో నితిన్ గడ్కరీ డిల్లీ ఎన్నికల ఇంచార్జ్జిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ స్థానంలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌నిగానీ , ఆరోగ్యమంత్రి జె.పి.నడ్డాని గానీ నియమించాలని అమిత్‌షా యోచిస్తున్నారని అంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశముంది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే.
విధానసభ ఎన్నికలు బీజేపీ పకడ్బందీ ప్రణాళికలు
Published Tue, Nov 18 2014 10:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement