70 నియోజకవర్గాల్లో 810 మంది
Published Thu, Nov 21 2013 11:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: బరిలో నిలిచేవారెవరో ఖారారైపోయింది. మొత్తం 70 నియోజకవర్గాలకుగాను 900 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించగా వారిలో 90 మంది తాము వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో నిలిచేవారి సంఖ్య 810 మందికి పరిమితమైంది. ఈ విషయమై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్ దేవ్ మాట్లాడుతూ... ‘డిసెంబర్ 4న ఢిల్లీ విధానసభకు జరగనున్న ఎన్నికల్లో 810 మంది పోటీ చేయనున్నారు. అత్యధికంగా బురారి నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఆ తర్వాత మాతియా మహల్, మాతియాల నియోజకవర్గాల నుంచి 19 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి అత్యల్పంగా కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పోటీపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 1,110 మంది నామినేషన్లు వేయగా అందులో 210 మంది నామినేషన్లను తిరస్కరించాం.
మిగతా 900 మంది నామినేషన్లను స్వీకరించినా అందులో 90 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక పార్టీల వారీగా పోటీ చేస్తున్నవారి వివరాల్లోకెళ్తే... కాంగ్రెస్ నుంచి 70 మంది, ఏఏపీ నుంచి 70 మంది, బీజేపీ నుంచి 66 మంది, బీఎస్పీ నుంచి 69 మంది, సీపీఐ నుంచి 10 మంది, ఎన్సీపీ నుంచి 9 మంది, సీపీఐ(ఎం) నుంచి ఏడుగురు, అకాళీదళ్ నుంచి నలుగురు పోటీ చేస్తుండగా మిగతావారు స్వతంత్రులు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,134 మంది నామినేషన్ వేయగా 194 మంది నామినేషన్లను తిరస్కరించారు. 65 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలోకి దిగినవారు 875 మంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ చేస్తున్నవారి సంఖ్య తగ్గింద’న్నారు.
Advertisement