Birender Singh
-
కడప స్టీల్ ప్లాంట్‌పై వారంలో ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై వారంలో అధికారిక ప్రకటన చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, జయదేవ్ తదితరులు శనివారం ఢిల్లీలో ఆయనను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, భాగస్వామ్య ఏర్పాటుపై ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ప్లాంట్‌ను మొత్తంగా కేంద్రం ఏర్పాటు చేయడం, లేదా ఏపీతో భాగస్వామ్యం, అదీ కుదరకుంటే మొత్తంగా ఏపీకి అప్పగించడం, ఏపీ–ప్రైవేటు భాగస్వామ్యం, పూర్తిగా ప్రైవేటుకు ఇవ్వడం.. వంటి ఐదు ప్రతిపాదనలపై చర్చించారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన జీ–2 లెవెల్ ఎక్స్‌ప్లోరేషన్ నివేదిక రావడానికి రెండేళ్లు పడుతుందని.. అప్పటిదాకా ఎదురుచూడకుండా మెకాన్ సంస్థ తన తుది నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని మంత్రిని కోరారు. 30 ఏళ్లపాటు ప్లాంట్‌కు ఖనిజ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఓబులాపురంలోని 8 గనుల్లో మూడింటిని 2020 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌కు అప్పగిస్తామని తెలిపారు. కేంద్ర తరఫున ఏడేళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, పదేళ్లపాటు ఐటీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏపీ వ్యవహారాల్లో జీవీఎల్ తలదూర్చకుంటే మంచిది కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు చూస్తే ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం ఆయన చేతుల్లో లేనట్టు తెలుస్తోందని టీడీపీ ఎంపీలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. అయినా ఆయన మాత్రం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇక ప్లాంట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నివేదికలు ఇవ్వకపోడంపై ట్విటర్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన ప్రశ్నపై టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్ ఏపీ వ్యవహారాల్లో తలదూర్చకపోతే మంచిదన్నారు. బీజేపీ ఆయన్ను ఆంబోతులా రాష్ట్రం మీదికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసు: జీవీఎల్ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసని టీడీపీ ఎంపీలనుద్దేశించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ, అవగాహన తక్కువంటూ ఎద్దేవా చేశారు. డ్రామాలు, అవినీతిపై వారికున్న శ్రద్ధ అభివృద్ధిపై ఉంటే బాగుండేదన్నారు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులు, సహకారం విషయంలో చర్చకు రావాలని సవాల్ విసురుతున్న సీఎం రమేష్ కూడా సుజనాచౌదరిలా పారిపోతారా? అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమేనంటూ జీవీఎల్ శనివారం ట్వీట్ చేశారు. -
‘పద్మావతి’ సినిమాకు కేంద్రమంత్రి సింపుల్ పరిష్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలని, సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని సూచించారు. ’కొన్ని చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలి. సినిమాలో ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేయాలి’ అని ఆయన పీటీఐతో పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమాలు సర్టిఫై చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)దని, మొదట సెన్సార్ బోర్డు తన పనిని పూర్తిచేయనివ్వాలని సూచించారు. కాగా, ఇప్పటికే పద్మావతి సినిమాను నిషేధించిన మధ్యప్రదేశ్ సర్కారు.. తాజాగా రాణి పద్మావతి స్మారక కట్టడాన్ని నిర్మించాలని నిర్ణయించింది. -
తెలుగు, కన్నడ రాష్ట్రాలకు నిధులివ్వండి
* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరిన కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటకలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను సమయానుసారంగా విడుదల చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి వెంకయ్య సోమవారం బీరేంద్ర సింగ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సకాలంలో నిధులు విడుదల చేసి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని రెండో విడత నిధులను, 13వ ఆర్థిక మండలి నిధులను వారంలోపే విడుదల చేయడానికి గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్ సింగ్ హామీ ఇచ్చారు. -
విధానసభ ఎన్నికలు బీజేపీ పకడ్బందీ ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీజేపీ ముందుకు సాగుతోంది. 60కిపైగా సీట్లు గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్లతోపాటు పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల కోసం అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇక్కడికి వచ్చినపుడు వారితో ప్రచారం చేయించాలని ఈ సందర్భంగా అమిత్‌షా నిర్ణయించారు. తెలుగువారిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జాట్ గ్రామస్తులను బీరేందర్ సింగ్, పూర్వాంచలీయులను బీహార్, ఉత్తరప్రదేశ్ ఎంపీలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. జాతీయ రాజధానిలో చేపట్టనున్న పథకాలను వీలైనంత త్వరగా ప్రారంభించడమే కాకుండా కేంద్రమంత్రులతో వాటికి ప్రారంభోత్సవం చేయించాలని బీజేపీ యోచిస్తోంది. రహదారులు, విద్యుత్, నీటి సరఫరాతోపాటు మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టుల జాబితాను ఆ పార్టీ నాయకులు రూపొందించనున్నారు. వారంలోగా రూపొందించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో గత వారం జరిపిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించినట్లు తెలిసింది. నగరంలో అమలయ్యే పథకాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌తోపాటు సంబంధిత అధికారుల వద్ద నుంచి కేంద్రం సమాచారం తీసుకుందని, సామాన్య ప్రజలతో ముడిపడిన పథకాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించి అందించాలని కేంద్రం వారిని కోరిందని అంటున్నారు. ఆ తరువాత ఏ మంత్రి ఏ పథకాన్ని ప్రారంభించాలనేది నిర్ణయిస్తారని అంటున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ ఢిల్లీలో బీజేపీని గెలిపించడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల బాధ్యతలు మరో నేతకు ఇదిలా ఉండగా ఢిల్లీ ఎన్నికల బాధ్యతలను మరో జాతీయస్థాయి నేతకు అప్పగించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గత విధానసభ లోక్‌సభ ఎన్నికల సమయంలో నితిన్ గడ్కరీ డిల్లీ ఎన్నికల ఇంచార్జ్జిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ స్థానంలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్నిగానీ , ఆరోగ్యమంత్రి జె.పి.నడ్డాని గానీ నియమించాలని అమిత్‌షా యోచిస్తున్నారని అంటున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశముంది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతోపాటు కేంద్రమంత్రలుగా బాధ్యతలను నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28. ఇందులో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆ పార్టీ బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టనివ్వలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ విధానసభను రద్దు చేసిన సంగతి విదితమే. -
జాట్ నేతకు దక్కిన కేబినెట్ పదవి
జాట్ సామాజిక వర్గానికి చెందిన హర్యానా నాయకుడు సీహెచ్ బీరేంద్ర సింగ్ కు ఎట్టకేలకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. 68 ఏళ్ల బీరేంద్రకు ఉన్నత పదవులు అందినట్టే చేజారాయి. 2004లో హర్యానా సీఎం రేసులో నిలిచినప్పటికీ భూపేందర్ సింగ్ హుడా అది దక్కింది. 2010లో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమయి చివరి నిమిషంలో చేజారింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన బీరేంద్ర ఐదుసార్లు హర్యానా ఎమ్మెల్యేగా, మూడు పర్యయాలు మంత్రిగా పనిచేశారు. 2010లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. అసంతృప్తితో రగిలిపోతున్న బీరేంద్రను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా జాట్ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని భావించింది. ఫలితంగా 2014 ఆగస్టులో బీరేంద్ర ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనను చేర్చుకోవడం ద్వారా బీజేపీ లాభపడిందనడానికి ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలే రుజువు. బీరేందర్ భార్య కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా హామీయిచ్చిన మేరకు బీరేందర్ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ. తమ నాయకుడికి కేంద్ర మంత్రి దక్కడం పట్ల బీరేంద్ర మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.