జాట్ నేతకు దక్కిన కేబినెట్ పదవి
జాట్ సామాజిక వర్గానికి చెందిన హర్యానా నాయకుడు సీహెచ్ బీరేంద్ర సింగ్ కు ఎట్టకేలకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. 68 ఏళ్ల బీరేంద్రకు ఉన్నత పదవులు అందినట్టే చేజారాయి. 2004లో హర్యానా సీఎం రేసులో నిలిచినప్పటికీ భూపేందర్ సింగ్ హుడా అది దక్కింది. 2010లో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రి పదవి ఖాయమయి చివరి నిమిషంలో చేజారింది.
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన బీరేంద్ర ఐదుసార్లు హర్యానా ఎమ్మెల్యేగా, మూడు పర్యయాలు మంత్రిగా పనిచేశారు. 2010లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. అసంతృప్తితో రగిలిపోతున్న బీరేంద్రను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా జాట్ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని భావించింది. ఫలితంగా 2014 ఆగస్టులో బీరేంద్ర ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ఆయనను చేర్చుకోవడం ద్వారా బీజేపీ లాభపడిందనడానికి ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలే రుజువు. బీరేందర్ భార్య కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా హామీయిచ్చిన మేరకు బీరేందర్ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ. తమ నాయకుడికి కేంద్ర మంత్రి దక్కడం పట్ల బీరేంద్ర మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.