
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలని, సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని సూచించారు.
’కొన్ని చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలి. సినిమాలో ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేయాలి’ అని ఆయన పీటీఐతో పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమాలు సర్టిఫై చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ)దని, మొదట సెన్సార్ బోర్డు తన పనిని పూర్తిచేయనివ్వాలని సూచించారు. కాగా, ఇప్పటికే పద్మావతి సినిమాను నిషేధించిన మధ్యప్రదేశ్ సర్కారు.. తాజాగా రాణి పద్మావతి స్మారక కట్టడాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment