
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై వారంలో అధికారిక ప్రకటన చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, జయదేవ్ తదితరులు శనివారం ఢిల్లీలో ఆయనను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, భాగస్వామ్య ఏర్పాటుపై ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ప్లాంట్‌ను మొత్తంగా కేంద్రం ఏర్పాటు చేయడం, లేదా ఏపీతో భాగస్వామ్యం, అదీ కుదరకుంటే మొత్తంగా ఏపీకి అప్పగించడం, ఏపీ–ప్రైవేటు భాగస్వామ్యం, పూర్తిగా ప్రైవేటుకు ఇవ్వడం.. వంటి ఐదు ప్రతిపాదనలపై చర్చించారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన జీ–2 లెవెల్ ఎక్స్‌ప్లోరేషన్ నివేదిక రావడానికి రెండేళ్లు పడుతుందని.. అప్పటిదాకా ఎదురుచూడకుండా మెకాన్ సంస్థ తన తుది నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని మంత్రిని కోరారు. 30 ఏళ్లపాటు ప్లాంట్‌కు ఖనిజ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఓబులాపురంలోని 8 గనుల్లో మూడింటిని 2020 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌కు అప్పగిస్తామని తెలిపారు. కేంద్ర తరఫున ఏడేళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, పదేళ్లపాటు ఐటీ మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఏపీ వ్యవహారాల్లో జీవీఎల్ తలదూర్చకుంటే మంచిది
కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు చూస్తే ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం ఆయన చేతుల్లో లేనట్టు తెలుస్తోందని టీడీపీ ఎంపీలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. అయినా ఆయన మాత్రం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇక ప్లాంట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నివేదికలు ఇవ్వకపోడంపై ట్విటర్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన ప్రశ్నపై టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్ ఏపీ వ్యవహారాల్లో తలదూర్చకపోతే మంచిదన్నారు. బీజేపీ ఆయన్ను ఆంబోతులా రాష్ట్రం మీదికి వదిలేసిందని విమర్శించారు.
రాష్ట్రాన్ని దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసు: జీవీఎల్
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసని టీడీపీ ఎంపీలనుద్దేశించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ, అవగాహన తక్కువంటూ ఎద్దేవా చేశారు. డ్రామాలు, అవినీతిపై వారికున్న శ్రద్ధ అభివృద్ధిపై ఉంటే బాగుండేదన్నారు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులు, సహకారం విషయంలో చర్చకు రావాలని సవాల్ విసురుతున్న సీఎం రమేష్ కూడా సుజనాచౌదరిలా పారిపోతారా? అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమేనంటూ జీవీఎల్ శనివారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment