16 ఐటమ్స్తో అమ్మా బేబీ కేర్ కిట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నవజాత శిశువులకు.... అమ్మా బేబీ కేర్ కిట్ పేరుతో ముఖ్యమంత్రి జయలలిత మరో పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.67 కోట్లు ఖర్చు కానుంది. ఈ విషయాన్ని జయలలిత మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది.
వెయ్యి రూపాయల విలువ చేసే ఈ కిట్లో పుట్టిన బిడ్డకు కావల్సిన 16 వస్తువులు ఉంటాయి. ఇందులో టవల్, బేబీ డ్రస్, బేబీ బెడ్, ప్రొటక్షన్ నెట్, న్యాప్కిన్, బేబీ ఆయిల్, షాంపు, సాచెట్, సోప్ బాక్స్, సోప్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయ్తో పాటు తల్లికి హ్యాండ్ వాష్ లిక్విడ్తో పాటు సోప్ ఉంటుంది.
కాగా జయలలితకు తమిళనాడు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ వాటర్ బాటిళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు సగటు జీవి ఏకైక వినోద సాధనమైన సినిమాను నిరుపేదలకు సైతం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో వారికి అందుబాటు ధరల్లో అమ్మ థియేటర్లను ప్రవేశపెడుతోంది. అలాగే నాణ్యమైన, సరసమైన ధరలకు రైతులకు 'అమ్మ సీడ్స్' పేరుతో విత్తనాలను అందుబాటులోకి తేనుంది.