అరాచకశక్తుల పట్ల అప్రమత్తత అవసరం
సీఎం సిద్దరామయ్య
బెంగళూరు(బనశంకరి) : సమాజాన్ని చీల్చే అరాచకశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మనవిచేశారు. రంజాన్ సందర్బంగా శనివారం ఉదయం చామరాజపేటెలోని ఈద్గా మైదానానికి వెళ్లి ముస్లింలతో కలిసి ప్రత్యేక పార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో నివసిస్తున్న అందరూ భారతీయులేనని మొదట దేశం అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అని అన్నారు. రంజాన్ ఉపవాసం మంచి ఉద్దేశం కలిగి ఉందని చెడ్డవారిని దూర ం చేసి అందరికీ మంచి చేయడం రంజాన్ సందేశమని తెలిపారు.
హిందూ, ముస్లిం ఒకే తల్లి పిల్లలని అందరూ సోదర భావంతో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత తీసుకురావాలనే కారణంతో తమ ప్రభుత్వం అన్నభాగ్య పథకం అమలు చేసిందన్నారు. ఆకలిలేని కర్ణాటక తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్‌హర్షద్, నేత జీఏ బావా తదితరులు పాల్గొన్నారు.