‘ఆస్కా’ సమరం
Published Sun, Oct 27 2013 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఒకచోట కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు 1952లో ఏర్పడిన ఆస్కా నేడు ఒక పెద్ద ప్రతిష్టాత్మక సంఘంగా ఎదిగింది. తొలిరోజుల్లో ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు 16 ఏళ్లు ఎన్నో కష్టనష్టాల కోర్చి నడిపారు. తర్వాత ఈఎస్ రెడ్డి, ఎం.ఆదిశేషయ్య, కె.నరసారెడ్డి, కొడవలూరు సుబ్బారెడ్డి తదితర ఎందరో తెలుగు ప్రముఖులు తమ వంతు జీవం పోశారు. ఆంధ్రాక్లబ్ అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆస్కా కమిటీకి అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులుగా ఎన్నిక కావడమే కాదు, సాధారణ సభ్యత్వం ఉన్నా గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఎవరి ధీమా వారిది
ఆస్కాకు హోరాహోరీగా సాగుతున్న ద్విముఖపోరులో రెండు ఫ్రంట్ల వారూ గెలుపు తమదేనంటున్నారు. ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున తాజా మాజీ అధ్యక్షులు కె.సుబ్బారెడ్డి, డెమొక్రటిక్ ఫ్రంట్ తరపున మాజీ అధ్యక్షులు ఎం.ఆదిశేషయ్య అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. వేణుగోపాల్ అనే వ్యక్తి అధ్యక్షునిగా, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి కార్యదర్శిగా స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. రెండు ఫ్రంట్లలోని అభిమానుల ఓట్లు, ఆ రెండింటికీ దూరంగా మెలిగే తటస్థ సభ్యుల ఓట్లను కొల్లగొట్టాలనే వ్యూహంతో రంగంలోకి దిగిన జేకే రెడ్డి సైతం గెలుపుధీమాతో ఉన్నారు.
మొత్తం 4 వేల వరకు సభ్యత్వం కలిగిన ఆస్కాలో 2,759 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆదివారం ఉదయం 9నుంచి 1గంట వరకు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 8గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. భోజన విరామం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆస్కా చరిత్రలోనే తొలిసారిగా ఓటింగ్‌కు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఓటింగ్‌లో అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
అభివృద్ధే నినాదం: ఆదిశేషయ్య
అభివృద్ధి బాటలో, అందరికీ అందుబాటులో నినాదమే నా ప్యానల్‌ను గెలిపిస్తుంది. గతంలో అధ్యక్షునిగా ఎనిమిదేళ్లు చేసిన అభివృద్ధే ఈనాటి ప్రగతికి పునాదులుగా చెప్పవచ్చు. నా హయాంలో జరిగిన సంస్కరణల వల్లే నేడు ఆస్కా కుటుంబ సభ్యులందరికీ ప్రీతిపాత్రమైంది. భవిష్యత్తులోనూ మరింత ముందుకు సాగాలన్న ఉద్దేశంతో మా ప్యానల్‌లో కొత్తవారికి అవకాశం కల్పించాను.
Advertisement
Advertisement