జై జవాన్
కదిరి : సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం కాపలా ఉంటూ పాక్ సైనికుల దాడిలో అసువులు బాసిన అనిల్‌కుమార్‌రెడ్డికి ఆదివారం అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామం తలుపుల మండలం తూపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్‌ఎఫ్ జవాన్ల బృందం అంత్యక్రియల సమయంలో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి తోటి జవాన్‌కు నివాళులర్పించారు.
మృతుడి భార్య అపర్ణ.. భర్త భౌతికకాయం మీద పడి కాసేపు అలాగే సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని ఖననం చేసేముందు కూడా తన రెండేళ్ల చిన్నారి త్రిపురను చంకనేసుకొని ఆమె ఁఇంగ మీ నాన్న తిరిగిరాడమ్మా.. మీ నాన్నకు దాహమేస్తోంది. నీ చేత్తో కొన్ని నీళ్లు తాపు తల్లీ* అంటూ భర్త నోట్లో ఆ చిన్నారి చేత నీళ్లు పోయించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఆమెతో పాటు మరింత బిగ్గరగా ఏడ్చారు.
తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడన్న బాధ తమను వేదిస్తున్నప్పటికీ దేశం కోసం ప్రతి కుటుంబం నుండి ఒకరిని సైన్యంలోకి పంపితే మంచిదని మృతుడి తల్లిదండ్రులు ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డిలు దేశంపై వారికున్న అభిమానాన్ని చాటి చెప్పారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్‌బాషా, ఆ పార్టీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి, కుర్లి శివారెడ్డి, బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ శంకర్, ఉత్తారెడ్డితో పాటు పలువురు మృతదేహంపై పూలమాలలు, జాతీయ పతాకాన్ని కప్పి నివాళులర్పించి ఁజై జవాన్* అన్న నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే.. జవాన్ మృతదేహాన్ని చూడగానే కంటతడి పెట్టారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ 10 లక్షలు ఆర్థిక సాయంతో పాటు మృతుడి భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న, పెద్ద, ఆడ, మగ, కులం, మతం అన్న తేడా లేకుండా ఊరు ఊరంతా అంతిమ యాత్రలో పాల్గొని ఁమా ఊరి జవాన్ ఇక లేడు* అని కన్నీరు కార్చారు. కాల్పులు జరిగిన సంఘటనా స్థలం నుండి మృతదేహాన్ని కోల్‌కతాకు తీసుకొచ్చి అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం బెంగుళూరుకు బీఎస్‌ఎఫ్ జవాన్లు విమానంలో తీసుకొచ్చారు.
అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా శనివారం అర్దరాత్రికి అనిల్ భౌతికకాయాన్ని స్వగ్రామం చేర్చారు. ఆ సమయంలో తన భర్త మృతదేహాన్ని చూడగానే ఆయన సతీమణి అపర్ణతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. బీఎస్‌ఎఫ్ 119వ బెటాలియన్ జవాన్ ప్రతాప్‌కారే నేతృత్వంలో కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఎస్పీ దేవదానం, సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.