అరెస్ట్ చేస్తారా?
♦ మంత్రుల్లో ఆందోళన
♦ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు
♦ విజయభాస్కర్ వైపు సీబీఐ చూపు
♦ 122 మంది ఎమ్మెల్యేలపై గురి
సాక్షి,చెన్నై: అధికారులకు బెదిరింపులు, ఐటీ ఉచ్చు వెరసి మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంత్రులు అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న సమాచారం ఉత్కంఠను రేపుతోంది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలకు ముగ్గురు మంత్రులు సిద్ధమయ్యారు. ఇక, ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన ఐటీ దాడులు మంత్రులకు సంకట పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి.
ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పలుమార్లు ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఆయన్ను పదే పదే ఆదాయ పన్ను శాఖ వర్గాలు విచారిస్తూ రాగా, ఇక ఆయనపై సీబీఐ కూడా దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీబీఐ విచారణకు ప్రతి పక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ పరిశీలనలు సాగుతున్నట్టుంది. విజయ భాస్కర్‌ను సీబీఐ కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఎక్కడ ఆయన అరెస్టు అవుతారోనన్న చర్చ బయలు దేరింది.
అలాగే, ఐటీ అధికారుల్ని బెదిరించి ఇరుకున పడ్డ మరో ముగ్గురు మంత్రుల్ని పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న ఉత్కంఠ సాగుతోంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ మంత్రులు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఐటీ అధికారుల్ని బెదిరించిన వ్యవహారంలో మంత్రులు ఉడుమలై కే రాధాకృష్ణన్, కామరాజ్, కడంబూరు రాజాలపై అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసుల్ని నమోదు చేశారు.
వీరిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణానంతరం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆ ముగ్గురు మంత్రులు ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో దాఖలు చేయడానికి తగ్గ సూచనల్ని తమ న్యాయవాదులకు జారీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌లను కోర్టులో దాఖలు చేయడానికి న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు.
122 మంది ఎమ్మెల్యేల్ని విచారించేనా: కువత్తూరు వేదికగా 122 మంది ఎమ్మెల్యేలను బల పరీక్ష సమయంలో బంధించి ఉన్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ వద్ద సాగిన ఐటీ విచారణలో కువత్తూరులోని ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా ఐటీ వర్గాలుకు చిక్కినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేల్ని విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. అంత మంది ఎమ్మెల్యేల్ని విచారణకు పిలిపించడం కన్నా, సమగ్ర సమాచారంతో అడుగులు వేయడానికి తగ్గ కార్యచరణతో ఐటీ వర్గాలు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.